ప్రవీణ్ కుమార్ బీజేపీ తొత్తా?…నిజమా…. తెరాస నేతలు గుండెల మీద చెయ్యేసుకుని చెప్పాలి

Ex IPS Rs Praveen Kumar Is Bjp Agent ?

0
133

దళిత, బహుజన బిడ్డలను విద్యావంతులుగా…ఎవరెస్ట్ శిఖరధిరోహులుగా తీర్చిదిద్దడానికి 9 ఏళ్లపాటు అకుంఠిత దీక్షతో కష్టపడిన మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తెరాస నేతలకు బీజేపీ తొత్తుగా కనిపించడం విచారకరం. బీజేపీ పక్కా మనుధర్మ శాస్త్రాన్ని ఆచరించే హిందుత్వ రాజకీయ పార్టీ. మనుధర్మ శాస్త్రం ప్రకారం దళితులు, బహుజనులు విద్యను అభ్యసించరాదు.. ఆస్థులను కూడపెట్టుకోరాదు.

సామాజికంగా మూడు వర్ణాలకు సేవకులు(బానీసలు)గా కొనసాగాలి. ఈ మనుధర్మ శాస్త్రాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబాఫూలే, గౌతమ బుద్ధుడు, ఛత్రపతి శివాజీ , పెరియర్ వంటి మహానీయులు తూర్పారబట్టారు. దళితులు, బహుజనులు విద్యావంతులుగా మారితేనే వారి బ్రతుకులు బాగుపడతాయని అంబేద్కర్ బోధించారు. రాజ్యాంగంలో హక్కులను కల్పించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని అమలులో పెట్టేందుకు దళిత, బహుజన విద్యార్థులను అక్షరాస్యులుగా తిర్చిదిద్దేందుకు స్వేరోస్ పేరిట గుతుకులాల బాధ్యతను భుజాలపై ఎత్తు కున్నారు.

నిజానికి ఒక ఐపీఎస్ గా ఆయన పోలీసు అధికారిగా ఉన్నతమైన పదవులను అనుభవించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆయన కమీషనర్ గా పనిచేయాలి. కానీ ప్రవీణ్ కుమార్ పదవులపై పట్టించుకోకుండా దళిత, బహుజన బిడ్డల భవిష్యత్తును బాగుచేసే కర్తవ్యాన్ని నిర్వర్తించారు. అంటే ఆయన పక్కా అంబేద్కర్ ఆలోచన విధానంలో నడుస్తున్నారని అర్ధం. అంబేద్కర్ ఆలోచనా విధానం అంటే మనుధర్మ శాస్త్రాన్ని వ్యతిరేకించడం. మనుధర్మ శాస్త్రాన్ని వ్యతిరేకించేవాళ్లు బీజేపీ కి ఎట్లా తొత్తులుగా మారుతారో సదరు తెరాస నేతలే చెప్పాలి.

ప్రవీణ్ కుమార్ బీజేపీ ఏజెంట్ అని ఆరోపించిన వాళ్లలో దళితులు, బిసీ సామాజిక వర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నారు. ఆ ప్రజాప్రతినిధులు గుండెమీద చెయ్యేసుకుని మనసాక్షితో ఈ ఆరోపణలు చేయగలరా?. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ నిజంగానే బీజేపీకి తొత్తుగా మారితే నిరూపించొచ్చు కదా?. రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీగా కొనసాగుతున్న టీఆర్ఎస్ ను దెబ్బతీయడానికి బీజేపీ ఆర్.ఎస్.పీ అనే అస్త్రాన్ని సంధించిందని ఆరోపించారు. టిఆర్ఎస్ ను రాజకీయంగా దెబ్బతీస్తే బీజేపీకి మేలు కలుగుతుండొచ్చు. కానీ దళితులు, బీసీలకు రాజ్యాధికారంలో వాటా దక్కదు జదా?. అటువంటప్పుడు దళితులు, బహుజన బిడ్డల బాగు కోసం పనిచేసిన ఆర్ఎస్పీ ఈ వర్గాలకు ఉపయోగపడని బీజేపీ కి ఎందుకు మద్దతు ఇస్తారు. అయినా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో దళితులు, బహుజనులు రాజకీయంగా ఎదగకూడదా?. ఎప్పటికీ అభివృద్ధి చెందిన కులాలకు బానీసలుగానే కొనసాగాలా?. పాలకులు విసిరే ఎంగిలి మెతుకుల కోసం ఆశపడాలా?. దేశ, రాష్ట్ర ఖజానా నింపేది ఎవరో తెలుసా?. ఈ దళితులు, బహుజనులే. అవునా?… అని నోరెళ్లబెట్టకండి.

పొద్దున నిద్రలేచింది మొదలు తిరిగి నిద్రపోయే వరకు పళ్లుతోమే పేస్టు ..బియ్యం..కారం..ఉప్పు..పప్పు ఇట్లా అన్ని రకాల వస్తువులను ఎక్కువగా ఉపయోగించేది నీటకి 85 శాతంగా ఉన్న వర్గాలే. ఆయా వస్తువులపై విధించే పన్నులను, వాటి రవాణాకు వినియోగించే పెట్రోలియం ఉత్పత్తుల పై విధించే సుంకాలను చెల్లించేది ఈ వర్గాలే. ఒక రకంగా చెప్పాలంటే ఈ దేశాన్ని, రాష్ట్రాలను నడిపించేది ఈ వర్గాలే. దేశానికి వెన్నుముఖలైన ఈ వర్గాలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎందుకు అభివృద్ధి చెందడం లేదు?. 15 శాతంగా ఉన్న కులాలు, వర్ణాలు ఎందుకు అభివృద్ధిని సాధించాయి?. ఎందుకంటే ఆ పిడికెడు వర్గాలు భూములను చెరబట్టి తద్వారా అధికారంలోకి వచ్చి అన్ని రంగాల్లో అందనంత ఎత్తుకు ఎదిగారు.

దళిత, బహుజనులు మాత్రం అధికారానికి దూరంగా ఉండి పోవడం వల్లే అభివృద్ధిని అందుకోలేకపోయారు. ఈ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించినా పాలక వర్గాలు సరిగా అమలు చేయలేదు. పైగా అభివృద్ధి చెందిన కులాల్లో పేదలకు రిజర్వేషన్లు కల్పించి రిజర్వేషన్ తీరును అవమానించారు. ఈ కారణంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాధికారం అనే మాస్టర్ కీని అందుకోవాలని సూచించారు. కానీ పాలకవర్గాలు ఉచిత బియ్యం, కళ్యాణలక్ష్మీ వంటి ఉచిత పథకాల ఆశలు చూపి అధికారానికి దూరంగా ఉంచుతూ వస్తున్నారు.

గతంలో కాంగ్రెస్, టీడీపీ లు ప్రస్తుతం తెరాస , బీజేపీ లు ఉచిత పథకాలతో ఈ వర్గాలను మభ్యపెట్టి మాయ చేస్తున్నాయి. ‌గొర్రెలు, బర్రెలిస్తామంటూ కుల వృత్తుల చట్రంలో బంధిస్తున్నాయి. అంతే తప్ప జనాభా ప్రకారం అధికారంలో వాటా మాత్రం కల్పించడం లేదు. కాబట్టి దళితులు, బహుజనులు బాగుపడాలంటే స్వంత రాజకీయ పార్టీ ఉండాలని మాన్య కాన్షీరాం బీఎస్పీ ని ఎర్పాటు చేశారు.

అంబేద్కర్ ఆలొచనా విధానంలో కొనసాగుతున్న పార్టీలో చేరడాన్ని తప్పుపడుతున్న తెరాస నేతలు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ని పెట్టకపోయి ఉంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండేది కాదు. మీరు ప్రజాప్రతినిధులు, మంత్రులు అయ్యేవారూ కాదు. మీకు అంబేద్కర్ మీద గౌరవం ఉంటే ఆయన విధానాలకు అనుగుణంగా ఎర్పాటైన బీఎస్పీలో చేరి దళితులు, బహుజనులకు రాజ్యాధికారం కల్పించేందుకు కృషి చేయండి. అంతే తప్ప ఆర్ఎస్పీని విమర్శించడం ద్వారా దళితులు, బహు జనులను రాజ్యాధికారం లోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు మాత్రం దయచేసి చేయకండి. బీఎస్పీ ఎదుగుదలతో తెరాస, కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పార్టీల ఉనికి ప్రమాదంలో పడితే పడొచ్చేమో.‌అంత మాత్రాన ఈ వర్గాలు స్వయంగా రాజ్యాధికారం లోకి రాకూడదా?. తెరాస తో పాటు ఇతర అన్ని రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్న దళితులు, బహుజన నేతలూ మన బ్రతుకులు మారడానికి మీరూ మీ వంతు తోడ్పాటును అందించండి.
– జంగిటి వెంకటేష్, తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఉపాధ్యక్షుడు.
– 9052889696