ఇంటికో లక్ష ఇద్దామనన్నాను, అప్పుడు కేసిఆర్ కు మండింది : ఈటల హాట్ కామెంట్స్

0
127

 హుజురాబాద్ మండలం చెల్పూర్ లో బీజేపీ కార్యకర్తలతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుంచి పలువురు ఈటల సమక్షలో బీజేపీలో చేరారు. చెల్పూర్ సర్పంచి నేరెళ్ల మహేందర్ గౌడ్(కాంగ్రెస్)తో పాటు, ఆరుగురు వార్డు సభ్యులు, ఇద్దరు ప్రాథమిక సహకార సంఘం సభ్యులు, పలువురు స్థానిక నాయకులు బిజెపిలో చేరినవారిలో ఉన్నారు. వారికి కండువా కప్పి ఆహ్వానించారు ఈటల రాజేందర్.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడిన మాటలు…

18 సంవత్సరాలుగా తమ్ముడిగా, కుడిభుజంగా చలామణి అయిన ఈటల రాజేందర్.. అర్దగంటలోనే ఎలా దయ్యం అయ్యాడు?

2018 ఎన్నికల సమయంలో  ఓ వ్యక్తి చేత నామీద కరపత్రాలు, పోస్టర్లు కొట్టించి నా వ్యక్తిత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేసారు.

నా దగ్గరకు ఎవరు వచ్చినా చేతనైన సాయం చేసాను తప్ప ఎవరి దగ్గర రూపాయి బిల్ల తీసుకోలేదు.

ఎమ్మెల్యేగా ఉన్ననాడైనా, మంత్రిగా ఉన్ననాడైనా ఏనాడు డాబు దర్పం ప్రదర్శించలేదు. ఎవరిపైనా కేసులు పెట్టించలేదు.

డబ్బులకు అమ్ముడుపోయే ఆ వ్యక్తి ఇప్పటికే అనేక మంది మీద బ్లాక్ మెయిల్ చేస్తూ ఇలాంటి కరపత్రాలే వేసాడు.

కరపత్రాలు వేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేస్తే… కేసీఆర్ ఆఫీసు నుంచే మీ మీద కరపత్రం వేయించాలని, నిన్ను ఓడగొట్టాలని డబ్బులు పంచారని ఆ వ్యక్తే చెప్పాడు.

ఎంత దుర్మార్గమో మీరే ఆలోచించండి.

చేను కాపాడుకోవడానికి రైతు కంచె వేసుకుంటాడు. కానీ ఆ కంచే చేను మేయాలని చూస్తే ఎలా ఉంటుంది.

నాకు టికెట్ ఇచ్చినవాళ్లే నన్ను ఓడగొట్టాలని చూసారు. 

అధికార పార్టీలో ఉన్న నా ఇంటి మీద పోలీసులతో దాడి చేయించారు.  అయినా ఇవన్నీ భరిస్తూ వచ్చాను.

గ్రామాల్లో తిరిగినప్పుడు ప్రజల తరపున ఫించన్లు ఇవ్వాలని అడిగాను. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త ఫించన్లు, కొత్త రేషన్ కార్డులు కావాలన్నాను.

నాకు మంత్రి పదవి ఉన్నా రేషన్ కార్డు ఇవ్వలేని దుస్థితిలో నేను ఈ పదవి ఎందకని భావించాను.

రైతు బంధు ఇవ్వాలి. కానీ గుట్టలకు, అక్కరకు రానీ భూములకు, భూస్వాములకు ఇవ్వొద్దని చెప్పాను.

ఉద్యోగం లేక ఇబ్బందులకు పడుతున్న నిరుద్యోగులకు ఇంటికో లక్ష ఇవ్వాలని అడిగాను.

రైతులు పండించిన పంటలు కొనాలని కోరాను. ఐకేపీ సెంటర్లు ఉంటాయని చెప్పాను.

నా సొంత వ్యవహారంపై నేను పార్టీ మారలేదు. ఇవన్నీ అడిగినందుకే నన్ను బయటకు పంపారు.

గతంలో ఓ పత్రికలో నాపై ఏవేవో  రాస్తే ఈ పార్టీ జెండాకు ఓనర్లమని చెప్పాను.

పదవుల కోసం పెదవులు మూస్తే నాకు పదవి ఉండేది.

తెలంగాణ ఉద్యమంలో నామీద ఎన్నో కేసులయ్యాయి.

కరీంనగర్ మంత్రి ఏనాడైనా జైలుకు వెళ్లాడా?

అయినదాన్ని ఆకుల్లో, కానిదాన్ని కంచాల్లో పెట్టాడు కేసీఆర్.

20 ఏళ్లుగా సర్పంచి నుంచి ఎందరినో గెలిపిస్తే.. సొంత పార్టీ వాళ్లనే కొనుగోలు చేసిన నీచపు సంస్కృతికి తెరలేపాడు.

ఈటల రాజేందర్ తప్పు చేసాడంటున్నారు. దీనిపై నా భార్య స్టేట్ మెంట్ ఇచ్చింది.

ఒక ఎకరం అక్రమంగా ఉన్నా ముక్కు నేలకు రాస్తామని చెప్పింది.

లేదు అని తేలితే నువ్వు ముక్కు నేలకు రాస్తావా అని ముఖ్యమంత్రిని అడిగింది.

ఆస్తులైనా అమ్ముకుని కొట్టాడుతాం, కూలీ చేసుకోనైనా బతుకుదాము కానీ కెసిఆర్ కి మాత్రం లొంగవద్దు అని చెప్పింది.

నేను మీలాగా ఫ్లెక్సీలపై ఉండే బొమ్మను కాదు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న బిడ్డను.

18 ఏళ్లుగా ఇక్కడకు ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి రాలేదు. నేను తప్ప ఇక్కడి ప్రజలకు ఎవరూ అండగా లేరు.

ఇక్కడ జరిగిన అభివృద్ధంతా నేను చేసింది కాదా? నాకంటే ముందు ఇక్కడ ఇలాగే ఉండేదా?

చీమలు పెట్టిన పుట్టలో నేను చేరానని ఒకడు మాట్లాడుతున్నాడు? ఎవరు పెట్టిన పుట్టలో ఎవరు చేరారో అందరికీ తెలుసు.

ఈటల రాజేందర్ కు అండగా ప్రచారం చేస్తున్న వారికి ఫోన్లుచేసి బెదిరిస్తున్నారు.

ఇలాంటి బెదిరింపులకు ప్రజలు లొంగరు.

నాయకులు పిడికెడు మంది మాత్రమే.. నీతిగా బరిగీసే శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుంది.

కుల సంఘాల భవనాలు, డబ్బులు, ఫించన్లు, రేషన్ కార్డులు ఇప్పుడే ఎందుకు ఇస్తామంటున్నారో ప్రజలు ఆలోచించండి.

ఈటల రాజేందర్ వల్లే ఇవన్నీ ఇస్తే నేను కూడా సంతోష పడుతా. కానీ నన్ను ఓడించడానికే అన్న విషయం ప్రజలు గుర్తించాలి.

మీ ఊర్లకు ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు వస్తున్నారు? నేను రాజీనామా చేయకపోతే వీళ్లందరు వస్తురా?

ఇప్పుడు నేను బీజేపీలో ఉన్న .. నా గుర్తు కమలం పువ్వు గుర్తు.

రాజేందర్ అనగానే కారు గుర్తు అనుకుని పొరపాటు పడేరు.

నేను మనిషిగా చిన్నగా ఉండొచ్చు. కానీ కొట్లాడే దగ్గర రాజీపడను.

మీరందరూ నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరుతున్నా అని ఈటల రాజేందర్ అన్నారు.