వారం రోజుల్లో ఫీవర్‌ సర్వే పూర్తి: తెలంగాణ సీఎస్

0
109

తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి ఫీవర్ సర్వే మొదలు పెట్టనున్నామని మంత్రి హరీష్ రావు నిన్న ప్రకటించారు. సిఎం కెసిఆర్ ముందు చూపుతో ఇప్పటికే టెస్టులకు భారీగా కిట్ లను రెడీ చేసుకున్నామని చెప్పారు. ప్రతి జిల్లా, మండలం, గ్రామం.. వార్డుల్లో ఇంటింటా జ్వర సర్వే నిర్వహించి, లక్షణాలు ఉన్నవారికి మందుల కిట్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.

అలాగే రాష్ట్రంలో ఫీవర్ సర్వే వారం రోజుల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. ప్రజలందరూ ప్రభుత్వం చేస్తున్న ఈ ఫీవర్ సర్వేకు సహకరించాలని కోరారు. హైదరాబాద్ ఖైరతాబాద్​లో జరుగుతున్న ఫీవర్ సర్వేను సీఎస్ సోమేష్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఇతర అధికారులు పరిశీలించారు. ఫీవర్ సర్వే సమయంలో జ్వరం, లేదా ఇతర లక్షణాలు ఉంటే అక్కడికక్కడే మెడిసిన్ కిట్స్ అందజేస్తున్నట్లు చెప్పారు.

గ్రేటర్​ పరిధిలో సర్కిల్ వారీగా ఆశా వర్కర్లు, జీహెచ్ఎంసీ సిబ్బందిని విభజించి ఈ సర్వేలు చేపడుతున్నారు. ఇంటింటికీ వెళ్లి కుటుంబసభ్యుల వివరాలతో పాటు.. ఎవరికైనా జ్వరం, జలుబు, దగ్గు , గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉన్నాయా లేదా అని పరిశీలిస్తున్నారు. కోటి ఔషధ కిట్లను ఇప్పటికే అన్ని ఆస్పత్రులకు అధికారులు పంపించారు. కిట్‌లో అజిత్రోమైసిన్‌, పారాసిటమాల్‌, లెవో సిట్రిజన్‌, రానిటిడైన్, విటమిన్‌-C, మల్టీ విటమిన్‌, విటమిన్‌-D మందులు అందజేస్తున్నారు.