పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. బీజేపీలో చేరబోతున్నట్లు గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టిన ఆయన..సొంత పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో రాష్ట్రంలో జరిగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు. పంజాబ్ శ్రేయస్సు, రాష్ట్ర ప్రజల సంక్షేమం, ఆందోళన చేస్తున్న రైతుల సంక్షేమం కోసం తమ కొత్త పార్టీ పని చేస్తుందని అమరీందర్ సింగ్ మీడియా సలహాదారుడు రవీన్ తుక్రాల్ వరుస ట్వీట్స్ చేశారు.
అధికారికంగా అమరీంధర్ సింగ్ ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు. కాంగ్రెస్ అధిష్టానం తాజా పరిణామాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. బీజేపీ, అకాలీ దళ్‌తో కెప్టెన్ చేతులు కలిపారని తాను ముందే చెప్పానని పంజాబ్ మంత్రి పర్గత్ సింగ్ వ్యాఖ్యానించారు. బీజేపీ అజెండా కెప్టెన్ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు.
79 ఏళ్ల కెప్టెన్ అమరీందర్ సింగ్..కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటల కారణంగా ఇటీవల తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. సిద్ధూ, అతని మద్ధతుదారులైన ఎమ్మెల్యేలతో నెలకొన్న విభేదాల కారణంగానే అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయన స్థానంలో చన్నీ ఆ రాష్ట్ర సీఎం అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో తనకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని అమరీందర్ సింగ్ మండిపడ్డారు
https://twitter.com/RT_Media_Capt