టీచర్ నుండి రాష్ట్రపతి..ద్రౌపది ముర్ము ప్రస్థానం ఇలా..

0
93

రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపదీ ముర్ము విజయకేతనం ఎగురవేశారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. రాష్ట్రపతి పీఠాన్ని అధిష్ఠించబోతున్న ప్రథమ గిరిజన నాయకురాలిగా, రెండో మహిళగా ద్రౌపది ఘనత సాధించారు. ఆమె 15వ రాష్ట్రపతిగా దేశానికి సేవలందించనున్నారు. మరి ద్రౌపది ముర్ము రాజకీయ ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ద్రౌపది ముర్ము ప్రస్థానం ఇలా..

ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా బైడపోసిలో గ్రామంలో 1958 జూన్‌ 20న సంతాలి గిరిజన కుటుంబంలో ద్రౌపదీ ముర్ము జన్మించారు. ఆమె తండ్రి పేరు బిరంచి నారాయణ్‌ తుడు. ఆమె తండ్రి, తాత ఇద్దరూ గ్రామ సర్పంచ్‌గా సేవలందించారు.

మొదట టీచర్‌గా పనిచేసిన ద్రౌపదీ ముర్ము 1997లో భారతీయ జనతా పార్టీలో చేరి రాయరంగపూర్ నగర్ పంచాయితీ కౌన్సిలర్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. రాయ్‌రంగపూర్‌ నేషనల్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు.

రాయరంగపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

భాజపా- బిజూ జనతాదళ్‌ కలిసి ఏర్పాటు చేసిన నవీన్‌ పట్నాయక్‌ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వంలో 2000 నుంచి 2004 మధ్య మంత్రిగా పనిచేశారు.

2010, 2013లో మయూర్‌భంజ్‌ భాజపా జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశారు. 2013లో భాజపా ఎస్టీ మోర్చా జాతీయ కార్య నిర్వాహక సభ్యురాలిగా ఉన్నారు.

2015 నుంచి 2021 వరకు ఝార్ఖండ్ తొలి మహిళా గవర్నర్‌గా సేవలందించారు.