రేవంత్ రెడ్డి క్యాంపు ఆఫీస్ ఓపెనింగ్ చేసిన గాంధీభవన్ అటెండర్ కరోనాతో మృతి (వీడియో)

Ghandhi Bhavan Attender Mohammed shabbir Death

0
112

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్ లో సుదీర్ఘ కాలంగా అటెండర్ గా పనిచేస్తున్న మహ్మద్ షబ్బీర్ కరోనాతో బుధవారం మరణించారు. గత ఐదు రోజులుగా టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు.
గత మూడు దశాబ్దాల నుంచి మహ్మద్ షబ్బీర్ అటెండర్ గా గాంధీభవన్ లో సేవలందిస్తున్నారు. షబ్బీర్ అకాల మరణం పట్ల టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి, పార్టీ నేతలు కుమార్ రావు, బొల్లు కిషన్, నగేష్ ముదిరాజ్, కార్యాలయ సిబ్బంది సంతాపం తెలిపారు.
నన్ను బాధించింది : రేవంత్ రెడ్డి
గాంధీభవన్ సీనియర్ అటెండర్ షబ్బీర్ ఆకస్మిక మఋతి తనను తీవ్రంగా బాధించిందన్నారు టిపిసిసి వర్కింగ్ ప్రిసిడెంట్ రేవంత్ రెడ్డి. తన పార్లమెంటు కార్యాలయాన్ని గాంధీభవన్ అటెండర్ అయిన షబ్బీర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారని రేవంత్ గుర్తు చేసుకున్నారు. షబ్బీర్ ఆత్మకు శాంతి చేకూరాలని, భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి.

సిఎం లు కోట్ల విజయభాస్కర్ రెడ్డి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దాకా…

కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి, వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి లు ముఖ్యమంత్రులుగా డీఎస్, సత్యనారాయణ రావ్, కేకే, బొత్స, పొన్నాల, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు పీసీసీ అధ్యక్షులుగా ఉన్న కాలంలో షబ్బీర్ వారికి సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. అనేక మంది మంత్రులు, కేంద్ర మంత్రులు, ముఖ్య నాయకులు షబ్బీర్ ను ప్రేమగా పలకరించేవారన్నారు.

గాంధీ భవన్.లో షబ్బీర్ కు నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు
గాంధీ భవన్ లో షబ్బీర్ చిత్ర పటానికి పూలు చల్లి నివాళులు అర్పించారు సంగారెడ్డి ఎమ్యెల్యే జగ్గారెడ్డి. ఆయనతోపాటు నాయకులు కుమార్ రావ్, మహేష్ కుమార్ గౌడ్, బొల్లు కిషన్, నగేష్ ముదిరాజ్, మెట్టు సాయి తదితరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా షబ్బీర్ చేసిన సేవలను కొనియాడారు. షబ్బీర్ మూడు దశాబ్దాలుగా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో, తెలంగాణ లో పని చేసారన్నారు.

రేవంత్ రెడ్డి క్యాంపు ఆఫీస్ ను షబ్బీర్ ఓపెనింగ్ చేసిన వీడియో కింద చూడొచ్చు. రేవంత్ రెడ్డి దగ్గరుండి ఆయన చేత తన క్యాంపు ఆఫీసును ప్రారంభింపజేసుకున్నారు.

https://youtu.be/vORpX2zfO5Q