తెలంగాణ వృద్ధి రేటు రికార్డు స్థాయికి చేరుకుంది. 2021 -22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయంలో రాష్ట్రం రికార్డు స్థాయి వృద్ధి రేటు నమోదు చేసుకుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత జీఎస్‌డీపీ, తలసరి ఆదాయంలో ఇంత భారీగా వృద్ధి రేటు నమోదు కావడం ఇదే మొదటి సారి. జీఎస్ డీపీలో 19.46 శాతం నమోదు చేయగా.. తలసరి ఆదాయంలో దేశంలోనే అత్యధికంగా 19.10 శాతం వృద్ధిరేటును నమోదు చేయడం విశేషం.
2014-15 ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌డీపీలో 12.02 శాతం వృద్ధిరేటు నమోదవగా, తలసరి ఆదాయం 10.65 శాతం వృద్ధిరేటు నమోదు అయినట్లు గణాంకాలు వెల్లడించాయి. ఇక 2020-21 ఆర్థిక సంవత్సరంలో కరోనా నేపథ్యంలో జీఎస్‌డీపీలో 2.25 శాతం, తలసరి ఆదాయంలో 1.64 శాతం వృద్ధిరేటు నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం జీఎస్‌డీపీలో 16.85 శాతం వృద్ధిరేటు, తలసరి ఆదాయంలో 17.14 శాతం వృద్ధి రేటు అధికంగా నమోదైంది.
కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ సోమవారం ఈ లెక్కలను అధికారికంగా రిలీజ్ చేసింది. 2021 -22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ జీఎస్‌డీపీని ప్రస్తుత ధరల్లో రూ. 1154860 కోట్లుగా.. తలసరి ఆదాయాన్ని 278833 గా కేంద్రం నిర్ధారించింది. ఇక దీనిపై మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. “రాజకీయ కుట్రలను ఎదుర్కొంటూ,రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్ గారి ఆదర్శ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం అద్భుతాలు సృష్టిస్తూ, దేశంలో అగ్ర రాష్ట్రంగా నిలిచిందనడానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాలే నిదర్శనం.” అన్నారు.
https://twitter.com/trsharish?