అధికారంలోకి వచ్చినప్పటి ఉంచి ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుంటూ పలువురి మన్ననలు అందుకుంటున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్. పాలనలో ఆయన తీసుకొస్తున్న సంస్కరణలు పలు రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలను పర్యవేక్షించే పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలును చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల పని ఒత్తిడితో చాలా మంది పోలీసులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక సెలవులు దొరక్కపోవడంతో పండగలు, ఇంట్లోని ఫంక్షన్లకు కూడా హాజరవ్వలేక మానసిక ఆందోళనకు గురువుతున్నారు.
ఈ నేపథ్యంలో స్టాలిన్ ‘వీక్లీ ఆఫ్’ ఉత్తర్వులతో లక్షలాది మంది పోలీసులకు మేలు చేకూరుతుందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కొత్త ఉత్తర్వుల ప్రకారం.. ఫస్ట్, సెకండ్ గ్రేడ్ పోలీసులు, హెడ్ కానిస్టేబుళ్లకు వారంలో ఒకరోజు వీక్లీ ఆఫ్ తీసుకునే అవకాశం కల్పించారు. స్టేషన్లలోని ఇతర సిబ్బంది షిఫ్ట్ పద్ధతుల్లో వీక్లీ ఆఫ్ తీసుకోవచ్చు.