VRO లకు గుడ్ న్యూస్…సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

0
111

తెలంగాణలో విఆర్వో వ్యవస్థను రద్దు చేసి 16 నెలలు కావొస్తుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులను వివిధ శాఖల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. వీఆర్వోల సర్దుబాటు చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టింది. గతంలో విఆర్వోలను వ్యవసాయశాఖలో విలీనం చేస్తారని భావించగా ఇప్పుడు మున్సిపాలిటీలోనే సర్దుబాటు చేస్తారనే వార్తలతో విఆర్వోలు కలవరపడుతున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో విధులు లేకుండా 5,756 మంది విఆర్వోలు ఉన్నారు. వారిలో కొంతమందిని మున్సిపాలిటీలో కొత్తగా ఏర్పడిన 71 మున్సిపాలిటీలో సర్దుబాటు చేయలని ప్రభుత్వం భావిస్తోందట. ఇప్పటికే మున్సిపాలిటీలో ఖాళీల వివరాలను పురపాలకశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ప్రభుత్వానికి అందించారు. దీనితో మున్సిపాలిటీల్లో బిల్ కలెక్టర్లు, టాక్స్ ఇన్స్పెక్టర్లు, వార్డ్ ఆఫీసర్లు, జూనియర్ అసిస్టెంట్ లలో విఆర్వోలను సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫైల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వద్దకు చేరినట్టు తెలుస్తుంది. త్వరలోనే సీఎం కేసీఆర్ దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే తమను మున్సిపల్ శాఖలో సర్దుబాటు చేస్తే సర్వీస్ తో పాటు సీనియారిటీ ఇబ్బందులు వస్తాయని విఆర్వోలు అంటున్నారు. అందుకే తమను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. బిల్లింగ్ ఉన్న విఆర్వోలకు ఆప్షన్ల ద్వారా సర్దుబాటు చేయాలనీ కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన తమకు అన్యాయం జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు విఆర్వోలు. మరి సీఎం కేసీఆర్ ఫైనల్ గా ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.