ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..5 రోజుల పని పొడగింపు

0
98

అమరావతి పరిధిలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం అమరావతి పరిధిలో ఉద్యోగులకు ఐదు రోజుల పని విధానం అమల్లో ఉంది. ఈ విధానాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. దీనికి సంబంధించి సీఎస్‌ సమీర్‌శర్మ గురువారం ఈ ఉత్తర్వులిచ్చారు.

జూన్‌ 27నుంచి మరో ఏడాది పాటు ఈ విధానం కొనసాగనున్నట్లు జీవో నంబర్ 58లో ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. సచివాలయంలోని శాఖాధిపతులు, కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేవారికి ఈ ఆదేశాలు అమలవుతాయని చెప్పారు. ఉద్యోగులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకూ పని వేళలు ఉంటాయి.

ఈ నిర్ణయంపై సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకటరామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత వసతి సౌకర్యాన్ని మరో రెండు నెలలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మొదట జులై 1 లోపు ఫ్లాట్ లను వదిలి వెళ్లాలని ఉత్తర్వులు ఇచ్చారు.

ఉన్నఫలంగా ఆదేశాలు రావడంతో అమరావతిలోని ఉద్యోగులు అయోమయంలో పడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ సెక్రటేరియట్ అసోసియేషన్ వినతి మేరకు ఉచిత వసతి సదుపాయం మరో రెండు నెలల పాటు పొడిగించింది. నివాసాలను సౌకర్యవంతంగా ఉండాలని.. ఏమైనా జరిగినా ఉద్యోగులే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.