తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ పదవికి ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 10.40 నిమిషాలకు శాసన సభ సచివాలయంలోని సెక్రెటరీ ఛాంబర్ లో ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ఛైర్మన్ ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తారు.
రేపు ఉదయం 11 గంటలకు మండలి ఛైర్మన్ పదవికి ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ మేరకు మండలి అధికారులు సభ్యులకు సమాచారం అందించారు. ఒకటే నామినేషన్ వస్తే గుత్తా ఎన్నిక ఏకగ్రీవం కానుంది. గతంలోనూ మండలి ఛైర్మన్‌గా గుత్తా బాధ్యతలు నిర్వహించారు. ఛైర్మన్ ఎన్నిక అనంతరం డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికను చేపట్టనున్నారు. డిప్యూటీ ఛైర్మన్‌గా బండా ప్రకాశ్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
ఈ నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, మొహమ్మద్ ఆలీ, సత్యవతి రాథోడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఎం ఎస్ ప్రభాకర్ రావు, గొంగిడి సునీత, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు భాను ప్రసాదరావు, దామోదర్ రెడ్డి, గంగాధర్, యాగ మల్లేశం, జనార్ధన్ రెడ్డి, నవీన్ కుమార్, బండ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.