ఎన్‌ఎంసీ బిల్లు అతిపెద్ద సంస్కరణ: జీవీఎల్‌

ఎన్‌ఎంసీ బిల్లు అతిపెద్ద సంస్కరణ: జీవీఎల్‌

0
80

జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) బిల్లుపై అపోహలు అవసరంలేదని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. విజయవాడలోని ఓ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్‌ఎంసీ బిల్లు అతిపెద్ద సంస్కరణ అని చెప్పారు. దీనిపై కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని జీవీఎల్‌ విమర్శించారు. పార్లమెంట్ సమావేశాల్లో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు పూర్తి మెజార్టీ ఉన్నా.. జమ్మూకశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను తొలగించకుండా అభివృద్ధికి బదులు అవినీతికి అడ్డాగా మార్చాయని ఆరోపించారు. కేంద్రం నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారని, భాజపా అనుకూల పార్టీలతో పాటు వ్యతిరేక పార్టీలు కూడా ఆర్టికల్‌ 370 రద్దు బిల్లును సమర్థించడం దేశ సమగ్రతకు నిదర్శనమన్నారు. కేంద్రం చేసిన ఎన్నో మంచి పనులను తెదేపా ప్రభుత్వం అడ్డుకున్నందువల్లే ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పారని.. అయినా ఓటమికి కారణాలు అర్థం కావడం లేదంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం ఆశ్చర్యంగా ఉందని జీవీఎల్‌ ఎద్దేవా చేశారు. జగన్ పాలనపై ఆరు నెలల తర్వాత స్పందిస్తామని చెప్పారు. ఏ ప్రభుత్వానికైనా కొంత వ్యవధి ఇవ్వాలని, ఆ తర్వాత ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తామని ఆయన స్పష్టం చేశారు.