Breaking news: కొత్త టీపీసీసీ తరువాత వారిద్దరు మొదటి సారి ముచ్చట్లు..కాంగ్రెస్ లో కొత్త జోష్..

0
75

తెలంగాణ రైతుల సమస్యలపై గళం విప్పేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. వానాకాలం ధాన్యం కొనుగోళ్లు, యాసంగి వరి సాగుపై టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతూ వరి దీక్ష చేపట్టనున్నారు. దీనితో అధికార పార్టీని ఇరుకున పెట్టాలని టీ కాంగ్రెస్ భావిస్తుంది.

హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద శని, ఆదివారాల్లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ‘వరి దీక్ష’ చేపడుతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ రోజు రాత్రి అక్కడే బస చేసి రేపు 5 గంటల వరకు దీక్ష కొనసాగించనున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ముఖ్య నేతలు రెండు రోజుల పాటు జరిగే దీక్షలో భాగంగా శనివారం రాత్రి ముఖ్యనేతలు దీక్షాస్థలిలోనే ఉంటారని తెలిపారు. దగా పడుతున్న రైతులకు అండగా ఉంటామని, ప్రభుత్వాల మెడలు వంచి వారిని ఆదుకుంటామని పేర్కొన్నారు.

అయితే రేవంత్ రెడ్డి టీపీసీసీ అయిన తరువాత కొంతమంది సీనియర్లకు రేవంత్ తీరు నచ్చలేదు. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి ఎడమొఖం పెడమొఖంగా ఉన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మరోమారు రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ విమర్శలు కూడా చేశారు కోమటిరెడ్డి.

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకాన్ని తొలి నాటి నుండి వ్యతిరేకిస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారం రేవంత్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా తయారైంది. కానీ నేడు ఇందిరాపార్క్ లో కాంగ్రెస్ తలపెట్టిన వరి దీక్షలో రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి మొదటిసారి ముచ్చటించారు. ఇద్దరూ వేదికపై పక్క పక్కనే కూర్చున్నారు. దీనితో కాంగ్రెస్ లో కొత్త జోష్ రానుందని కార్యకర్తలు సంబుర పడుతున్నారు.