టీడీపీ(TDP)-జనసేన(Janasena) పొత్తు ఖాయమైన దగ్గరి నుంచి పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు వరుస లేఖలు రాస్తున్న కాపు సంక్షేమ నేత, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య తాజాగా మరో లేఖ రాశారు. “కాపులు భాగస్వాములుగా ఉన్న బడుగు బలహీనవర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి చేరాలని, ఆనాడే వారి భవిష్యత్తుకు ఒక దారి ఏర్పడుతుందని నమ్మి దీన్ని సాధించే దిశగా రాజ్యాధికారం దక్కించుకోవాలనే ప్రయత్నాన్ని వారందరూ మొదలుపెట్టిన మాట వాస్తవం. ఈ ప్రయత్నంలో భాగంగానే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి చేయాలని, వారు పెద్దన్న పాత్ర వహించటం ద్వారా బడుగు బలహీనవర్గాల బానిస సంకెళ్ళను బద్దలుకొట్టి ఈ సామాజికవర్గాలకు విమోచనం కల్గించాలనే ధ్యేయంతో ముందుకు నడుస్తున్న మాట వాస్తవం. ఈ ప్రయత్నంలోనే తెలుగుదేశం పార్టీని కలుపుకుని మొదటి దశలో భూస్వామ్య అగ్రవర్ణ ఆధిపత్యవర్గాలలో ఒకరైన వై.ఎస్.ఆర్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనకు అంతం పలకాలనే ప్రయత్నం జరుగుతోంది” అని లేఖలో పేర్కొన్నారు.
“అయితే ఈ మధ్య జరుగుతున్న పరిణామాలతో .. కూటమిలో పవన్ కళ్యాణ్ స్థానం ఏమిటి, ఎక్కడ అనే మీమాంస బడుగు బలహీనవర్గాలలో తలెత్తుతోంది. వారు కోరుకుంటున్న బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారం అనే అంశం ప్రక్కదారి పడుతున్నట్లుగా కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ఎన్నికలైనంత వరకు ఆగటానికి వీల్లేదనీ.. అలాగే వైఎస్ఆర్(YCP) పార్టీని ఓడించటం అనే అంశానికి గండి పడటానికి వీల్లేదు. బడుగు బలహీనవర్గాలు ఆశిస్తున్న ప్రకారం.. అధికారాన్ని పంచుకోవటంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు పాత్ర ఏమిటో తేల్చాలి.. అది తేలకుండా ముందుకు వెళ్లడానికి వీల్లేదు. అధికారంలో సగభాగం జనసేనకు దక్కాలనీ.. గౌరవమైన హోదాలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పదవి దక్కించుకోవాలి. అలాగే సర్వాధికారాలు పవన్ కళ్యాణ్‌కు దక్కాలి.. ఈ ప్రశ్నలకు తాడేపల్లి గూడెం సభ వేదికగా సమాధానమివ్వాలి.. సమాధానం రాకపోతే వ్యక్తిగతంగా నా నిర్ణయాన్ని ఫిబ్రవరి 29న ప్రకటిస్తా” అని హరిరామ జోగయ్య తెలిపారు.