హరితహారం తెలంగాణ మణిహారం..రాష్ట్ర పర్యటనకు వచ్చిన యూపీ, పంజాబ్, కర్ణాటక రైతులు

0
103

తెలంగాణలో వ్యవసాయం, ఇరిగేషన్ ప్రాజెక్టులు, వివిధ పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులు, రైతులు తెలంగాణలో పర్యటిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా, కేవలం ఎనిమిదేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజలో ఉందన్న విషయాన్ని తెలుసుకుని రాష్ట్ర పర్యటనకు వచ్చామని వారు తెలిపారు. తమ పర్యటనలో భాగంగా తెలంగాణకు హరితహారం అమలు తీరును తెలుసుకున్న ఇతర రాష్ట్రాల రైతు సంఘాల నేతలు, రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

రాజీవ్ రహదారి వెంట అవెన్యూ ప్లాంటేషన్ (రహదారి వనాలు), ఔటర్ రింగు రోడ్డుపై పచ్చదనం, సిద్దిపేట జిల్లా ములుగు, సింగాయపల్లి, కోమటిబండ ప్రాంతాల్లో క్షీణించిన అటవీ ప్రాంతాలను పునరుద్దరించటం ద్వారా కొన్నేళ్లలోనే చిక్కటి అడవిలా మార్చిన విధానాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్ & హెచ్ఓఓఎఫ్) ఆర్.ఎం.డోబ్రియాల్ సింగాయపల్లి అటవీ ప్రాంతానికి వారిని వెంట తీసుకువెళ్లి చూపించారు. కొన్నేళ్ల కిందట పూర్తిగా చెట్లు లేకుండా బోసిపోయిన ప్రాంతం అటవీ పునరుద్దరణ ద్వారా ప్రకృతి, పర్యావరణహితంగా మారిన విధానాన్ని అప్పటి- ఇప్పటి (నాడు –నేడు) ఫోటోలు, ప్రజంటేషన్ ద్వారా వివరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇదే తరహాలో అటవీ పునరుద్దరణ చేస్తున్నామని, పట్టణ ప్రాంతాలకు సమీప అటవీ ప్రాంతాల్లో 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణకు హరితహారం పథకం ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు మానస పుత్రిక అని సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి ఇతర రాష్ట్రాల రైతు నాయకులకు వివరించారు.

తెలంగాణను అత్యంత నివాసయోగ్యమైన రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశ్యంతో, 33 శాతం పచ్చదనం సాధించేందుకు ఎనిమిదేళ్లలో 267 కోట్ల మొక్కలు నాటామని, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం 7.7 శాతం పచ్చదనం రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిందని అన్ని రాష్ట్రాల ప్రతినిధులకు పీసీసీఎఫ్ డోబ్రియాల్ వివరించారు. ఒక ఉద్యమంలా తెలంగాణకు హరితహారం మణిహారంలా మారింది. ఈ పథకం అమలు చేస్తున్న తీరు అద్బుతంగా ఉందని, ప్రభుత్వం చిత్తశుద్దితో అమలు చేసిన తీరు, ఎక్కడ చూసిన పెరిగిన పచ్చదనంతో కళ్లెదుట కనిపిస్తోందని ఉత్తర ప్రదేశ్, పంజాబ్, కర్ణాటకతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి నుంచి వచ్చిన రైతులు ప్రశంసించారు.

రైతుల సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టులు ఇలా అభివృద్ది, సంక్షేమ పథకాలతో పాటు పర్యావరణ పరంగా కూడా హరితహారంను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పద్దతి చాలా బాగుందని, కేంద్ర ప్రభుత్వంతో పాటు, అన్ని రాష్ట్రాల్లో ఈ విధానం అనుసరణీయం అని ఇతర రాష్ట్రాల రైతు బృందం అభిప్రాయపడింది. తెలంగాణ అటవీ శాఖ అధికారులు తమ రాష్ట్రాల్లో పర్యటించి, పచ్చదనం పెంపు విధానాలను వివరించాలని రైతు సంఘాల నేతలు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, అటవీ అభివృద్ది కార్పోరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.