రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్‌తో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలంటూ బండి సంజయ్ చేస్తున్న దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. ఆయనను అరెస్ట్ చేసిన జైలుకు పంపించారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. దీనితో శంషాబాద్ విమానాశ్రయంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
శాంతి ర్యాలీ నిర్వహించేందుకు ఢిల్లీ నుంచి జేపీ నడ్డా హైదరాబాద్ చేరుకున్నారు. ఒకవైపు కోవిడ్ నిబంధనలు, మరోవైపు బీజేపీ క్యాండిల్ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తామని బీజేపీ నేతలు ప్రకటించగా.. అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో జేపీ నడ్డాను కలిసి ర్యాలీకి వెళ్లొద్దని కోరేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ర్యాలీకి అనుమతి లేదని జేపీ నడ్డాకు విమానశ్రయంలోనే పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశముంది.