జులై 1 నుంచి స్కూల్స్ ఓపెనింగ్ పై హైకోర్టులో విచారణ

High Court hearing on schools opening from July 1

0
136

జులై 1 నుంచి పాఠశాలల ప్రారంభంపై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. పాఠశాలల ప్రారంభంపై హైకోర్టుకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వివరణ ఇచ్చారు. పేరెంట్స్ అసోసియేషన్ వారు జులై 1 నుంచి స్కూల్స్ ఓపెన్ చేయడానికి అనుమతిస్తూ సర్కారు జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంగా అన్ని తరగతుల విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలా అని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏ ఏ తరగతుల వారు హాజరుకావాలనే విషయంలో రెండు, మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామని సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. ప్రత్యక్ష బోధనకు విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోందన్నారు సందీప్ కుమార్ సుల్తానియా. ఆన్ లైన్ బోధన కూడా కొనసాగుతోందన్నారు. విద్యా సంస్థలు తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలని సూచిస్తామన్నారు.

అయితే పాఠశాలల్లో భౌతిక దూరం పాటించడం కష్టం కదా? అని హైకోర్టు అభిప్రాయ పడింది. హైకోర్టు అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు విద్యాశాఖ కార్యదర్శి. వారం రోజుల్లో పూర్తి వివరాలు సమర్పించాలని విద్యా శాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ కేసును వాయిదా వేసింది.

ఇదిలా ఉంటే… తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టిందని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో రాష్ట్ర సర్కారు లాక్ డౌన్లు ఎత్తిపారేయడమే కాదు జులై 1 నుంచి అన్ని రకాల విద్యాసంస్థలు ఆరంభివచ్చని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కరోనా మూడో వేవ్ పిల్లల మీద ప్రభావం చూపొచ్చన్న వార్తలొస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పెద్దవాళ్లు, యువకుల దశ దాటి మూడో వేవ్ పిల్లల మీదే చూపబోతుందని సర్వత్రా ఆందోళన చెందుతుంటే తెలంగాణ సర్కారు బడులు ఓపెన్ చేయడమేందని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఫీజుల వసూళ్ల కోసమే స్కూల్స్ ఓపెనింగ్ అన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. జులై, ఆగస్టు నెలల్లో ట్యూషన్ ఫీజులు, బుక్స్ ఫీజులు, యూనిఫాం ఫీజులు, అన్ని రకాల ఫీజులు వసూలు చేసేసి వెంటనే మళ్లీ పాఠశాలలు మూసేస్తారా అని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. కార్పొరేట్ ఎడ్యూకేషన్ మాఫియా కోసమే స్కూళ్ల ఓపెనింగ్ అని విమర్శలు చేసేవారూ ఉన్నారు.