కొల్లాపూర్ లో హైటెన్షన్..టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్

0
84

తెలంగాణ: నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో హైటెన్షన్ నెలకొంది. టీఆర్ఎస్‌కు చెందిన ఇద్ద‌రు కీల‌క నేత‌ల మ‌ధ్య నెల‌కొన్న వివాద‌మే దీనికి కారణం..అసలేం జరిగిందంటే..కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచి అనంతరం తెరాసలో చేరారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ తొలి కేబినెట్ లో తెరాస తరపున మంత్రిగా పని చేశారు. ఒకే పార్టీలో ఉన్న వీరిద్దరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.

అయితే ఇద్ద‌రు నేత‌లు ఒక‌రిపై మ‌రొకరు శ‌నివారం తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించుకున్నారు. బ‌హిరంగ చ‌ర్చకు సిద్ధ‌మంటూ ఇద్ద‌రు నేత‌లు స‌వాళ్లు విసురుకున్నారు. ప‌ట్ట‌ణంలోని అంబేద్క‌ర్ స‌ర్కిల్ వ‌ద్ద జూప‌ల్లితో చ‌ర్చ‌కు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి బ‌య‌లుదేరేందుకు సిద్ధ‌ప‌డ్డారు. అభివృద్ధి, ఆరోపణలపై తమ చర్చకు అనుమతించాలంటూ ఇరువర్గాలు పోలీసులకు దరఖాస్తులు చేసుకున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా చర్చకు పోలీసులు నిరాకరించారు.

అయినా కానీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ చర్చకు వెళ్లాల్సిందే అని పట్టుబట్టారు. అప్పటికే భారీగా కార్యకర్తలు అక్కడికి చేరుకోగా పోలీసులు రంగంలోకి దిగారు. చర్చకు వెళ్తుండగా ఎమ్మెల్యే హర్షవర్ధన్ ను అరెస్టు చేసి వేరే ప్రదేశానికి తరలిస్తున్నారు. దీంతో కొల్లాపూర్‌ బస్టాండ్‌ వద్ద ఎమ్మెల్యే బీరం వర్గీయులు ఆందోళనకు దిగారు.