నీ సేవకు సలాం హిమజమ్మా..శిఖరమంత ఎత్తుకెదిగిన నీకు చిరుకానుక..

0
104

ఏమ్మో? హిమజమ్మా? అందుకున్నావా? మరో పురస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ జర్నలిస్ట్ గా! అంతకు ముందు రోజే అందుకున్నావుగా ఉత్తర అమెరికా వారిచే కోవిడ్ వారియర్ పురస్కారం? ఇన్ని పురస్కారాలను ఏం చేసుకుంటావు తల్లీ.. కిచెన్ లో కూరొండుకుంటావా? అయినా నువ్వు అలాంటి దానివేలే నాకు బాగా తెలుసు.

ఈ పురస్కారాలన్నీ కూడా కూరొండటానికి పనికొస్తే కచ్చితంగా అదే పని చేసి ఆకలి కడుపుతో ఉన్నోళ్లకు వండి వడ్డించేవూ? వృత్తిలో సమకాలీకులం, వయసులో కాస్త అటు ఇటుగా పెద్దొంటానేమో? కానీ వృత్తిలో సమకాలీకులమైనా కూడా సమానం కాదని నీకొచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు చెప్పేసిందిపో..ఏదైనా అదే పనిగా చేస్తే! వస్తేగిస్తే ఆపనిలో అపారమైన నైపుణ్యమైనా వస్తుంది.. లేకపోతే రొటీన్ పని ఎంతకని చేస్తామనే విసుగైనా వస్తోంది.. కానీ నీ విషయంలో ఏంటమ్మా పూర్తి విరుద్ధం.. చేసే కొద్దీ రెట్టింపు ఉత్సాహం? పంచే కొద్దీ పదింతల ప్రేమ పెరుగుతూనే ఉంటాయి. ఇదేలా సాధ్యం చెల్లెమ్మా అంటే? నవ్వేసి ఊరుకుంటావు గానీ సీక్రెట్ మాత్రం చెప్పవు. పైగా మీ బోటోళ్ల ఆశీస్సులు ఆశీర్వాదాలంటావ్!

పోనీలే అని సరిపెట్టుకున్నా కూడా, హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ ద్వారా.. ఆకలితో ఉన్న ఎంతోమందికి అన్నం పెట్టి అన్నపూర్ణవవుతావు.. ఆరోగ్యం బాగులేనోళ్ల పట్ల నిత్య సంజీవినవుతావు, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా చదువుకోనోళ్లకు లక్ష్మిని చేకూర్చి సరస్వతినందిస్తావ్! నీ సేవకు హద్దుల్లేవ్! సమాజం పట్ల నువ్వు చూపించే ప్రేమకు ఆకాశమే అవది! భూదేవికున్నంత సహనం నీకు మాత్రమే ఎలా? సొంతం అని అడగాలనే ఉన్నా కూడా మళ్లీ నవ్వేసి ఊరుకుంటావనే అడగట్లేదు. నువ్వు మహిళల్లో మణి పూసవి, నడవ లేనోళ్లకు నడిచేందుకు దన్ను నిచ్చే వెన్నుపూసవి.. పక్కోళ్లను నవ్వుతూ పలకరించడానికి కూడా ఆలోచించే ఈ రోజుల్లో కూడా ప్రేమను పంచడమంటే మామూలు విషయమా?
దీనికంటూ పురస్కారమే గనుక ఉండుంటే? అది నోబెల్ బహుమతి కంటే గొప్పదై ఉండాలి! అది నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ రావాలని కోరుకున్నోళ్లలో ఫస్ట్ నేనే ఉంటానని చెప్పడం స్వార్ధమే అవుతుంది. ఎందుకంటే? నీకు అలాంటి పురస్కారం రావాలని కొన్ని వేల మంది హృదయాలు కోరుకుంటాయన్నదే అక్షర సత్యం..

నిన్ను చూస్తుంటే చిన్నప్పుడు విన్న డైలాగొకటి గుర్తొస్తుంది.. రాక్షస సంహారం జరగాలి కానీ.. ఆ రాక్షసుడ్ని నా ఇంటి బిడ్డ చంపకూడదు అని… కానీ నీ విషయంలో దేశంలో ప్రతి ఇల్లూ ఆ మాటకొస్తే ప్రతి తల్లీ దండ్రీ ఈ బిడ్డ నా బిడ్డ ఎందుకు కాలేదా? అని అనుకోవడమే కాదు.. ఈ బుడి బుడి పాదాలు మా ఇంట ఎందుకు సందడి చెయ్యలేదా అని కచ్చితంగా అనుకుంటూ ఉంటారనే నేననుకుంటున్నాను..చెల్లమ్మా నీ విషయంలో నాకెప్పుడూ కన్ఫ్యూజనే! నీకు మహిళా దినోత్సవం రోజున శుభాకాంక్షలు చెప్పాలా? మాతృదినోత్సవం రోజున శుభాకాంక్షలు చెప్పాలా? రాఖీ పౌర్ణమి రోజున శుభాకాంక్షలు చెప్పాలా? ఒక్క మాటలో చెప్పాలంటే? మనిషి కోసం మనిషని మనల్ని ప్రతినిత్యం గుర్తు చేసే ప్రతి రోజూ నీకు శుభాకాంక్షలు చెప్పొచ్చని క్లారిటీ వచ్చేసింది.

ఇవన్నీ పక్కన పెట్టి నిన్ను ఆశీర్వదించాలంటే? ఏమని ఆశీర్వదించమంటావ్! నువ్వు ఎన్నుకున్న సేవామార్గంలో శిఖరమంత ఎదగమనాలా? అంటే? ఆల్రెడి నీపేరులో హిమం.. నీవయసుకు నువ్వు చేస్తున్న సేవలో ఎవరెస్టంత ఎత్తులోనే ఉన్నావని నేనడం కాదు.. నిన్ను చూసిన ప్రతి ఒక్కరి అభిప్రాయం కూడా దాదాపుగా ఇదే! ప్రపంచ దేశాలు ఆది పత్యం కోసం యుద్ధాలు చేస్తుంటే? నువ్వు ఎదుటి మనిషి ఆకలిని, తీర్చేందుకు నిత్యం యుద్ధం చేస్తూనే ఉన్నావు.. నువ్వు చేస్తోన్న ఈ యుద్ధం మహా సంగ్రామం కావాలని నా లాంటి ప్రతి ఒక్కరి కోరిక కూడా..ఆపన్న హస్తం కోసం.. ఎదురు చూసే ప్రతి ఒక్కరికీ నీ చేతులు అక్షయపాత్ర కావాలి..

మథర్ థెరిసా ప్రేరణతో సేవా కార్యక్రమాలను మొదలుపెట్టిన నీవు సిస్టర్ హిమజగా అందరి హృదయాల్లో చోటు సంపాదించావ్! ఇప్పుడు నీకొచ్చే పురస్కారాలు నీకోసం కావు.. నిన్ను స్పూర్తిగా తీసుకుని నీ మార్గంలో నడవాలని కోరుకునే ప్రతి ఒక్కరిదీ కూడా..నీ ప్రేమను పొంది, నీ చేతుల్ని ఊతంగా తీసుకొని తమ జీవితంలో కొత్త అడుగులు వేస్తోన్న ప్రతి ఒక్కరి ఆశీస్సులతో కూడిన మనసంత నవ్వే వేలాది పురస్కారాలకు సరిసమానం.. ఒక్క మాటలో చెప్పాలంటే? పురస్కారం.. నీ సేవలకు గుర్తింపని అనుకోను.. పురస్కారానికి, పురస్కారమే సత్కరించుకునే గొప్ప సందర్భం..మహిళా దినోత్సవం సందర్భంగా నువ్వు కోరుకున్న సేవా మార్గంలో హిమ(జ) శిఖర మంత ఎత్తుకెదిగిన నీకు ఓ అక్షరం అందిస్తోన్న చిరుకానుక.

సేకరణ : అజయ్ చెన్న… ఫేస్ బుక్ వాల్ నుంచి…