హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఉప సంహరణ పర్వం ముగిసింది. నామినేషన్ల ఘట్టంలో కీలకమైన గుర్తుల కేటాయింపుల ప్రక్రియ నేటి సాయంత్రం జరగనుంది. నామినేషన్ వేసిన 61 మందిలో 42 మంది నామపత్రాలు మాత్రం సక్రమంగా ఉండగా..వారిలో 12 మంది అభ్యర్థులు తమ నామపత్రాలను ఉపసంహరించుకున్నారు.
ఇక హుజూరాబాద్ ఉపఎన్నిక బరిలో 30 మంది మిగిలారు. బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలను అధికారులు వెల్లడించారు. బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకు అధికారులు గుర్తులను కేటాయించనున్నారు. ఇప్పటికే వారు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో కొన్నింటిని ఎంపిక చేసుకోగా.. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అక్షర క్రమంలో అభ్యర్థుల పేర్లను బట్టి వారికి వాటిని కేటాయించనున్నారు. ఈ నెల 30న ఎన్నిక జరగనుండగా..నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.
భాజపా అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన ఈటల జమునతో పాటు కాంగ్రెస్ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన వొంటెల లింగారెడ్డి తన నామపత్రాలను ఉపసంహరించుకున్నారు. అధిష్ఠానం ఆదేశం మేరకు నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.