హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరింది. ఈ సమయంలో అభ్యర్థులు చురుకుగా ఓటర్లను కలుస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి బుధవారం రాత్రి 7 గంటలకు తెరపడనుంది. కీలక ప్రచారానికి ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో అభ్యర్థులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నికను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోంది. ఈ నెల 30వ తేదీతో పోలింగ్ జరుగనున్న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ హుజురాబాద్ ఉపఎన్నికపై కరీంనగర్, హనుమకొండ కలెక్టర్లు, పోలీసుల అధికారులతో పోలింగ్, ఎన్నికల ఏర్పాట్లపై రెగ్యులర్‌గా సమీక్షిస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
హుజూరాబాద్ ఉపఎన్నికలో 305 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరగనుండగా..ఈసారి ఓటింగ్ పెరుగుతుందనే అంచనాతో అర్ధరాత్రి వరకు ఓటింగ్ ఉండనున్నట్లు తెలుస్తుంది. ఈ ఉప ఎన్నికలో 80 ఏళ్లు నిండిన వృద్ధులు, కోవిడ్ పేషంట్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకునేలా ఈసీ అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.
ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల అయ్యేనాటికి హుజూరాబాద్ నియోజకవర్గంలో 2.36 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య మరో పదివేలకు పెరిగింది. ఇంత పెద్దమొత్తంలో కొత్త ఓటర్లు పెరిగిపోవడం అభ్యర్థుల్లో ఒకింత ఆందోళనను రేపుతోంది. కొత్తగా నమోదైన ఓటర్లు గెలుపొటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది.