తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. అక్కడక్కడ చిన్న పాటి ఘర్షణలు తప్ప ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. సమయం ముగిసినా క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు ఎన్నికల అధికారులు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదు అయింది. హుజూరాబాద్‌లో మొత్తం 86.33 శాతం పోలింగ్ నమోదు అయింది.
అయితే హుజూరాబాద్‌లో 2018 ఎన్నికల్లో 84.5 శాతం పోలింగ్ నమోదు కాగా ఉపఎన్నిక పోలింగ్ 2018 నాటి పోలింగ్ శాతాన్ని మించే అవకాశం ఉంది. హుజూరాబాద్ నియోజవర్గం పరిధిలో మొత్తం 306 పోలింగ్ స్టేషన్లలో 2,37,036 మంది ఓటర్లు తమ తీర్పును వెలువరించనున్నారు. టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈటల రాజేందర్‌కు, తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కు ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ తరుపున కూడా ఆ పార్టీ అగ్రనేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ స్థానంలో మొత్తం 30 మంది పోటీలో ఉన్నారు.