అన్నీ అనుకున్నట్లు జరిగితే హుజూరాబాద్ నియోజకవర్గానికి సెప్టెంబరు నెలలో ఉప ఎన్నిక రావొచ్చంటున్నారు. ఒకవేళ కరోనా మూడో వేవ్ ప్రమాదకరంగా విరుచుకుపడితే మాత్రం మరింత కాలం ఆ ఎన్నిక ఆలస్యం కావొచ్చంటున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగానే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే హుజూరాబాద్ లో ఇప్పుడున్న పొలిటికల్ స్టేటస్ ఏంటి? ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? అనే విషయాన్ని తెలుసుకునేందుకు విన్ పొలిటికల్ కన్సల్టెన్సీ అనే సర్వే సంస్థ హుజూరాబాద్ నియోజకవర్గంలో సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ ను గురువారం రిలీజ్ చేశారు.
సర్వే రిపోర్ట్ లో ఉన్న అంశాలు…
హుజురాబాద్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 2,05,182 ఉండగా ఇందులో పోలయ్యే ఓట్లు లక్షా ఎనభై వేలకు పైనే ఉంటాయని సర్వే సంస్థ అంచనా వేసింది.
సర్వే రిజల్ట్ ఇలా ఉంది.
టిఆర్ఎస్ – 40 శాతం ఓట్ షేర్
బిజెపి – 35 శాతం
కాంగ్రెస్ – 20 శాతం
ఇతరులు – 05 శాతంతో ఉన్నారు.
ప్రస్తుతానికి టిఆర్ఎస్ పార్టీయే హుజూరాబాద్ లో లీడ్ లో ఉన్నట్లు సదరు సర్వే సంస్థ తేల్చి చెప్పింది. అయితే టిఆర్ఎస్ కు అంతగా ఆదరణ ఎందుకు ఉందని సర్వేలో అడిగిన ప్రశ్నలకు ప్రజల నుంచి వచ్చిన జవాబు ఏంటంటే… కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలేనట.
ఇక బీజేపీకి వచ్చేసరికి ఈటల రాజేందర్ బలమైన బీసీ నేత గా ఉండడంతోపాటు టిఆర్ఎస్ నుంచి గెంటివేయబడడం వల్ల ప్రజల్లో సానుభూతి ఉందని తేల్చింది. అయితే అవినీతి ఆరోపణలు రావడం, ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉండటం ఆయనకు వ్యక్తిగతంగా మైనస్ గా కనిపిస్తున్నాయని సర్వే సంస్థ విన్ పొలిటికల్ కన్సల్టెన్సీ వెల్లడించింది.
ఇక కాంగ్రెస్ కి వచ్చేసరికి పాడి కౌశిక్ రెడ్డి పై కొద్ది వరకు ప్రజల్లో ఆదరణ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పరిస్థితి ఆయనకు మైనస్ గా కనిపిస్తున్నది అని పేర్కొంది. ఈటల రాజేందర్ కు తన సొంత మండలం అయిన కమలాపూర్ లో భారీ మద్దతు ఉండగా పాడి కౌశిక్ రెడ్డి కి తన సొంత మండలం అయిన వీణవంక లో కొద్ది వరకు ప్రజా బలాన్ని కూడగట్టుకోగలిగారు.
ఒకవేళ పాడి కౌశిక్ రెడ్డి కనుక టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తే టిఆర్ఎస్ పార్టీకి, కౌశిక్ రెడ్డికి బాగా కలిసి రానుందని తెలిపింది. అప్పుడు పోటీ కేవలం టిఆర్ఎస్ బిజెపి ల మధ్య ఉండనుందని, కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోసం కష్టపడాల్సిన పరిస్థితులు ఉంటాయని పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వేలో తేటతెల్లమయింది.
మరిన్ని వివరాల కోసం విన్ పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వే సంస్థ కాంటాక్ట్ నెంబర్లు 81066 17917, 90300 98980 ను సంప్రదించవచ్చని తెలిపింది.