హుజూరాబాద్‌‌ తీర్పు రేపే..22 రౌండ్లలో కౌంటింగ్

Huzurabad verdict tomorrow .. the result will come in the evening

0
79

హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో శనివారం జరిగిన పోలింగ్‌లో ఓటర్లు భారీగా తరలివచ్చి ఓట్లేశారు. దాంతో రికార్డు స్థాయిలో 86.64 శాతం పోలింగ్‌ నమోదైంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు వేగంగా పూర్తవుతున్నాయి. మంగళవారం కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కాలేజీలో ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు, వివాదాలకు తావులేకుండా, సజావుగా నిర్వహించాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ కోరారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియను ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

పోలింగ్‌ ముగిసిన తర్వాత కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌ రూంలో ఈవీఎంలను భద్రపర్చారు. ఇక్కడ స్థానిక పోలీసులతోపాటు కేంద్ర బలగాలతో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. కళాశాల పరిసరాల్లో 144 సెక్షన్‌ విధించి మూడంచెల భద్రతను కల్పించారు. రెండో తేదీన ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పా ట్లు చేస్తున్నట్టు ఆదివారం కరీంనగర్‌లో రిటర్నింగ్‌ అధికారి, హుజూరాబాద్‌ ఆర్డీవో సీహెచ్‌ రవీందర్‌రెడ్డి తెలిపారు.

గ్రామాల్లో ఓటర్లు పోటెత్తారు. నియోజకవర్గంలోని 31 గ్రామాల్లో 90 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లిలోని 102 బూత్‌లో 93.93 శాతం పోలింగ్‌ నమోదైంది. జమ్మికుంట మండలం కోరపల్లిలోని 160 బూత్‌లో 93.91, కమలాపూర్‌ మండలం గూనిపర్తిలో 93.41 శాతం ఓటర్లు ఓటేశారు. ఇల్లందకుంట మండలం మల్యాలలోని 234 బూత్‌లో 93.57 శాతం, 235లో 93.42 శాతం, 236లో 93.04 శాతం పోలింగ్‌ నమోదు కావడం విశేషం.

ఓట్ల లెక్కింపునకు 14 టేబుల్స్‌ ఏర్పాటుచేశామని, 22 రౌండ్లలో లెక్కింపు పూర్తిచేస్తామని వెల్లడించారు. ఈవీఎం లు మార్చారని సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని రవీందర్‌రెడ్డి ఖండించారు. మాక్‌ పోలింగ్‌లో మొరాయించిన వీవీ ప్యాట్‌ను ఒక అధికారిక వాహనం నుంచి మరో అధికారిక వాహనంలోకి మార్చామని తెలిపారు. వీవీ ప్యాట్‌లో ఓట్లు ఉండవని, ఈవీఎంలలోనే ఓట్లు నిక్షిప్తమై ఉంటాయని వివరించారు.