హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణలో ప్రధాన పార్టీలకు సవాల్‌గా మారింది. ఇప్పటికే ఎవరికి వారు జనం మధ్యకు వెళ్లి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పోటాపోటీ ప్రచారాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు నానా తంటాలు పడ్డారు. బీజేపీ నుండి ఈటల రాజేందర్ ఆత్మగౌరవం నినాదంతో ప్రజల్లోకి వెళ్లగా..టీఆర్ఎస్ నుండి గెల్లు శ్రీనివాస్ పోటీలో ఉండగా తెలంగాణ ఉద్యమ సమయంలో గెల్లు ప్రధాన పాత్ర పోషించారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకట్ నాయక్ విద్యార్థి నేతగా పేరొందారు. ప్రధానంగా ఈ మూడు పార్టీలూ ఓట్ల కోసం విశ్వ ప్రయత్నం చేశాయి. కానీ హుజురాబాద్ ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఎవరికి ప్రతికూలంగా మారనున్నాయో చూడాలి మరీ. మొత్తానికి బైపోల్‌లో ఓటరు తీర్పు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ఎలక్షన్లకు ముందు సర్వేలు హడావిడి చేస్తే..పోలింగ్ ముగిశాక ఎగ్జిట్ పోల్స్ సందడి చేస్తున్నాయి. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు. విజయం ఎవరిని వరించనుంది. ఇలాంటి ప్రశ్నల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఆసక్తికరంగా మారాయి. వచ్చే నెల 2న వచ్చే ఫలితాల కోసం ఎదురుచూసే జనాలకు ఈ ఎగ్జిట్ పోల్స్ మరింత ఉత్కంఠ కలిగిస్తున్నాయి.
మూర్తి ఆత్మసాక్షి గ్రూప్ ఆఫ్ హైదరాబాద్ చేసిన సర్వే ప్రకారం ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇలా ఉన్నాయి. టీఆర్ఎస్ కు 43.1%, బీజేపీకి 50.5% కాంగ్రెస్ కు 5.7%, ఇతరులు, నోటాకు 0.7% వస్తాయని అంచనా. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అధికార పార్టీ తెరాసపై సుమారు 10,000 నుండి 13,000 మెజారిటీతో గెలుస్తాడని అంచనా.
అయితే అధికార పార్టీకి తక్కువ ఓట్లు రావడానికి, బీజేపీ గెలుస్తాయి అనడానికి ఈ కారణాలు ప్రధానంగా ప్రభావం చూపించాయి. దళితబంధు పథకాన్ని సరిగా అమలు చేయకపోవడం, ప్రధానంగా టీఆర్ఎస్ సర్కార్ పై నిరుద్యోగులు, ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. హుజూరాబాద్ లో అత్యధికంగా మహిళలు టీఆర్ఎస్ కంటే బీజేపీ వైపే మొగ్గు చూపడం. అటు ఈటలకు గౌడ్స్, ముదిరాజ్, పద్మశాలి, రెడ్డి కులాలు అనుకూలంగా ఉండడం. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపకపోగా..ఆ ఓట్లు కూడా బీజేపీ, టీఆర్ఎస్ కు వెళ్లడం. హుజూరాబాద్ కు ఈటల చేసిన అభివృద్ధి పనులు అనగా రోడ్లు, హాస్పిటల్స్, చెక్ డ్యాంలు కట్టడం వంటివి.