పిసిసి చీఫ్ గా ఛార్జ్ తీసుకున్న వెంటనే రేవంత్ రెడ్డిపై 2 పోలీస్ స్టేషన్లలో కేసులు

0
110

తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై రెండు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పలు సెక్షన్ల కింద హైదరాబాద్ పోలీసులు కేసులు పెట్టారు. వివరాలు ఇవి..

బుధవారం నాడు రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఉదయం పెద్దమ్మ తల్లి గుడిలో పూజలు చేసిన రేవంత్ రెడ్డి అక్కడి నుంచి భారీ ర్యాలీగా గాంధీభవన్ చేరుకున్నారు. ఈ ర్యాలీలో రేవంత్ రెడ్డితోపాటు ఇతర కీలక నేతలు కోవిడ్ నిబంధనలు పాటించలేదనే కారణంగా పోలీసులు కేసులు బనాయించారు. బంజారాహిల్స్ స్టేషన్ లో, బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో కేసులు ఫైల్ అయ్యాయి.

అనుమతి లేకుండా ర్యాలీల నిర్వహించడం, మాస్కులు లేకుండానే ఊరేగింపులో పాల్గొనడం, ప్రజలకు అసౌకర్యం కలిగించేలా పటాకులు కాల్చడం వంటి అంశాలను కేసులకు క్రైటీరియాగా తీసుకున్నారు. ఐపిసి సెక్షన్లతోపాటు జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.

రేవంత్ రెడ్డి తోపాటుగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, అనీల్ కుమార్ యాదవ్, పి. విష్ణు వర్దన్ రెడ్డి తోపాటు మరికొందరు నేతలపై కేసులు ఫైల్ అయ్యాయి.

గతంలో రేవంత్ రెడ్డి మీద అనేక సందర్భాల్లో పోలీసు కేసులు నమోదయ్యాయి. ఓటుకు నోటు కేసులో ఆయన జైలుకు సైతం వెళ్లి వచ్చారు. కానీ పిసిసి చీఫ్ హోదాలో ఆయనపై ఛార్జ్ తీసుకున్న గంటల వ్యవధిలోనే రెండు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు కావడం గమనార్హం.