ప్రశ్నిస్తే కేసులు జైళ్లా..? సీనియర్ జర్నలిస్టు అరెస్ట్ అప్రజాస్వామికం

If asked, are the cases jailed? The arrest of a senior journalist is undemocratic

0
84

ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే రాసలీల వ్యవహారంలో స్టింగ్ ఆపరేషన్ సీక్రెట్ కెమెరాకు చిక్కారనే సోషల్ మీడియా ప్రోమో హల్చల్ పైన ప్రభుత్వం ప్రముఖ రాష్ట్ర పరిశోధన జర్నలిస్ట్ ఆనంచిని వెంకటేశ్వరరావుపై అక్రమ కేసులు పెట్టి జైలుకు తరలించడం అప్రజాస్వామికమని తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం టీజెఎస్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సీనియర్ జర్నలిస్టు ఆనంచిని వెంకటేశ్వరరావును సిసిఎస్ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు హుటాహుటిన తరలించడం అన్యాయమన్నారు.

ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే రాసలీలలలో భాగంగా వెంకటేశ్వరరావు పరిశోధనాత్మక కథనం సిద్ధం చేస్తున్నారని దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో గుబులు మొదలైందని పేర్కొన్నారు. ఆ ఎమ్మెల్యే ఎవరు.? దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటి.? అన్న పూర్తి విషయాలు బయటకు రాకముందే వెంకటేశ్వర రావును అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు తరలించడం అక్రమమని పేర్కొన్నారు. గతంలో కూడా వెంకటేశ్వరరావు లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం జైలుకు పంపిందని, అక్రమ కేసులు నమోదు చేసిందని పేర్కొన్నారు. అధికార పార్టీ అక్రమాలు భాగోతాలపై వార్తలు ప్రసారం చేస్తే ముందుగానే జర్నలిస్టును నిర్బంధించడం అవివేకం అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులకు మీడియా స్వేచ్ఛ అసలు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మీడియా పై కక్ష కట్టిందని ఆవేదనచెందారు. టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ , అన్నంచిన్ని వెంకటేశ్వరరావు, తొలి వెలుగు రఘు, తీన్మార్ మల్లన్న, వెంకటేశ్వర రావు లాంటి వారిని ప్రభుత్వం టార్గెట్ చేసిందని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, ఎదిరించినా అక్రమ కేసులు నమోదు అవుతాయని, ఆ వెనువెంటనే జైలుకు కూడా తరలిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. నిజం భరించలేని ప్రభుత్వం, చేసిన అక్రమాలు కప్పిపుచ్చుకోవడానికి పోలీసులను వాడుకొని అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారని విచారం వ్యక్తం చేశారు.

వెంకటేశ్వరరావును ప్రభుత్వం విడుదల చేసే వరకు తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆందోళనలు ఆగవని హెచ్చరించారు. ప్రభుత్వంపై జర్నలిస్టుల పోరాటం ఆగదని గౌటి రామకృష్ణ పిలుపునిచ్చారు. వెంకటేశ్వరరావును వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.