తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే?..కేసీఆర్ కు ఓటమి తప్పదా? పీకే టీం సర్వేలో సంచలన నిజాలు..!

0
102

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తప్పవా? 2018లో తరహాలోనే కేసీఆర్ ఈసారి ముందస్తు ఎన్నికలకు సిద్దమయ్యారా? బిజెపిపై వార్‌, బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట, ఉద్యోగాల నోటిఫికేషన్, ఎన్నికల వ్యూహకర్త పీకే ఎంట్రీ ఇవన్నీ ముందస్తు ఎన్నికలకు సంకేతాలా? ప్రస్తుత పరిస్థితులు చూస్తోంటే ముందస్తు గంటలు స్పష్టంగా కొడుతున్నట్టు అనిపిస్తుంది. అలాగే కాంగ్రెస్ చీఫ్ రేవంత్, పలువురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముందస్తు ఎన్నికలు రానున్నాయని ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనితో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనే వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లయింది.

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ టీఆర్ఎస్‌కు పని చేస్తుండడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పీకే ఎంట్రీతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. రాజకీయ వ్యూహకర్తగా దేశంలోనే టాప్‌లో ఉన్న పీకే తన వ్యూహాలతో అనేకమంది నాయకులని గెలిపించారు. తన పదునైన వ్యూహాలతో ప్రత్యర్ధులకు చెక్ పెట్టేవారు. పీకే స్ట్రాటజీలతోనే జగన్, స్టాలిన్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రివాల్ లాంటి వారు గద్దెనెక్కారు. అందుకే ఆయన వ్యూహాలని వాడుకోవడానికి నాయకులు పోటీ పడుతున్నారు. పీకే డైరెక్షన్ లోనే కేసీఆర్ ఆందోళనలు, భౌతిక దాడులకు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే నేడు ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ చేసిన సంచలన ప్రకటన వెనుక పీకే ఉన్నట్లు నిరుద్యోగ యువత మాట్లాడుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు రెండు దఫాలుగా అధికారంలో కొనసాగుతుంది. మరోమారు టిఆర్ఎస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవడం వ్యూహంగా పావులు కదుపుతోంది. ఈ మేరకు పీకే టీం 22 రకాల సర్వేలను నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలలో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయం, నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు, ఎంపీల పనితీరు, రైతులు, కులాల వారీగా ప్రజల సమస్యలు, వారి ఓట్ల ప్రభావం, తదితర అంశాలపై పీకే టీం సర్వే చేస్తోంది.

ఈ సర్వేలో సంచలన నిజాలు వెల్లడయినట్లు తెలుస్తుంది. కేసీఆర్ పాలన, టిఆర్ఎస్ పార్టీపై ఉద్యమకారులు తీవ్ర అసహనంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రాధాన్యత ఇవ్వకపోగా ఇతర పార్టీల నుండి వలస వచ్చిన వారికి కీలక పదవులను ఇవ్వడాన్ని ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పార్టీ పరిస్థితి ఏమిటి అన్న దానిపై కూడా పీకే టీం సర్వే నిర్వహించినట్టు తెలుస్తుంది. తెలంగాణ ప్రజలలో టిఆర్ఎస్ పార్టీ పట్ల అనేక విషయాలలో ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతుందని గుర్తించారు.

అలాగే పార్టీలో జిల్లాల వారీగా గ్రూప్ తగాదాలు ఉన్నట్టుగా సర్వే టీం పేర్కొంటుంది. ఇలాంటి పరిస్థితులలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెలంగాణలో పార్టీ దెబ్బతినే అవకాశం లేకపోలేదని ప్రశాంత్ కిషోర్ టీం తమ సర్వే నివేదిక ద్వారా తేల్చి చెబుతోంది. మరి ఇలాంటి పరిస్థితులలో టిఆర్ఎస్ అధినేత ఏం మంత్రం వేసి ప్రజలను తనవైపు తెచ్చుకుంటారో చూడాలి? అలాగే ఉద్యమకారుల వ్యతిరేకతను తగ్గించుకోడానికి ఏం చేస్తారో చూడాలి.