ఏపీ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) అడ్డాగా గుడివాడ మారిపోయింది. గత 20 సంవత్సరాల నుంచి ఆయనే గుడివాడ ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలవగా.. 2014, 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ నుంచి విజయం సాధించారు. ఈసారి కూడా గుడివాడ నుంచి ఎన్నికై రికార్డు సృష్టించాలని భావిస్తున్నారు. అయితే సీఎం జగన్‌కు కొడాలి షాక్ ఇవ్వనున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది.
గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న మండలి హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో బ్యానర్లు వెలిశాయి. దీంతో గుడివాడ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు అయిన హనుమంతరావుకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చిందని.. ఆయనను గుడివాడ అభ్యర్థిగా ఎంపిక చేశారంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ ఫ్లెక్సీలు కలకలం రేపడంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే వాటిని తొలగించారు. అయితే పార్టీ పెద్దల ఆదేశాలు లేకుండా బ్యానర్లు ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదని పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. ఐప్యాక్ సర్వేల్లో కొడాలి నాని(Kodali Nani)కి వ్యతిరేకంగా రిపోర్టులు వచ్చాయని.. అందుకే ఆయన స్థానంలో కాపు సామాజిక వర్గానికి చెందిన మండలి హనుమంతరావుకు సీటు ఇవ్వాలని భావిస్తున్నట్లుగా కూడా గుసగుసలాడుకుంటున్నారు. మరి ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.