కాంగ్రెస్ అధ్యక్షుడి పేరు ఖరారు చేయడం ఆ పార్టీకి కష్టంగా మారుతోంది. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆసక్తి కనబర్చట్లేదు. రాహుల్ గాంధీ అధ్యక్షుడు అవడానికి సుముఖంగా లేరు. సోనియా గాంధీయే కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉండి ఆమెకు సహాయంగా కనీసం ముగ్గురు సీనియర్ నాయకుల్ని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో నియమించాలని కొందరు సీనియర్లు అంటున్నారు.
కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం త్వరలో సీడబ్ల్యూసీ సమావేశం కానుంది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ ఏర్పాట్లు పూర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు సెప్టెంబరు 20లోగా కొత్త అధ్యక్షుడి ఎన్నుకోనున్నారు.
ఇలాంటి తరుణంలో గాంధీ కుటుంబం కాకుండా ఇతరుల పేర్లు కూడా వెలుగులోకి రావడం గమనార్హం.ఈ క్రమంలో అధ్యక్ష పదవికి కొత్త పేరు తెరపైకి వచ్చింది. రాజస్థాన్ CM అశోక్ గెహ్లాట్ ఈ పదవి చేపట్టనున్నట్లు, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆయనకు ఆ పదవి ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ కొత్త సారథి ఎవరో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.