Breaking- వారికి సర్కార్ శుభవార్త..తగ్గిన మద్యం ధరలు

0
121

ఏపీలో మద్యం ధరలకు సంబంధించి జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మద్యం పన్ను రేట్లలో మార్పులు చేసింది. వ్యాట్, అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ ప్రత్యేక మార్జిన్‌లో హేతుబద్ధతను తీసుకొచ్చింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వ్యాట్, అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ ప్రత్యేక మార్జిన్‌లో హేతుబద్ధత తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది.

బ్రాండ్‌ను బట్టి క్వార్టర్‌పై కనీసం రూ.20 నుంచి రూ.50 వరకూ, ఫుల్‌ బాటిల్‌పై రూ.120 నుంచి రూ.200 వరకూ తగ్గించింది. అన్ని రకాల బీర్లపై రూ.20- రూ.30 వరకూ ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. వ్యాట్, అదనపు ఎక్సైజు డ్యూటీ ప్రత్యేక మార్జిన్లల్లో హేతుబద్దత కోసం మార్పులు చేసింది ప్ర‌భుత్వం. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యం, రాష్ట్రంలో నాటు సారా తయారీని అరికట్టేందుకు ధరల తగ్గింపు నిర్ణయం తీసుకుంది ప్ర‌భుత్వం.

అలాగే, వచ్చే వారంలో రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లోనూ ప్రముఖ కంపెనీల బ్రాండ్ల మద్యం విక్రయించేలా జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల కారణంగా రాష్ట్రంలో 37 శాతం మేర మద్యం వినియోగం తగ్గిందని ఉత్తర్వుల్లో తెలిపింది.  మద్యం ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మద్యం ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చీప్‌ లిక్కర్‌లోని కొన్ని రకాల బ్రాండ్ల ధర తెలంగాణ కంటే ఏపీలోనే తక్కువగా, మరికొన్ని బ్రాండ్ల ధర తెలంగాణతో సమానంగా ఉండేలా సవరించారు. ధరల తగ్గింపు ఆదివారం నుంచే అమల్లోకి రానుంది. చీప్‌ లిక్కర్‌ రేట్లు గణనీయంగా తగ్గటం వల్ల వినియోగం మరింత పెరిగి.. ప్రభుత్వానికి లభించే ఆదాయమూ పెరగనుంది.