విశాఖ ఉక్కు ఉద్యమంలో జనసేనాని భాగం కానున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా..కేంద్రంపై తన గళం వినిపించనున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వ్యతిరేక పోరాటానికి సంఘీభావం ప్రకటించనున్నారు. ఇప్పటికే పోరాటం సాగిస్తున్న కార్మిక సంఘాలకు మద్దతు ప్రకటించేందుకు విశాఖపట్నం చేరుకున్నారు. కాసేపట్లో కూర్మన్నపాలెంలో జరిగే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. విమానాశ్రయం నుంచి పవన్ సభాస్థలికి బయల్దేరారు. దారిపొడవునా జనసేన శ్రేణుల కోలాహలం కనిపిస్తోంది.
పవన్ తన పర్యటనలో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిరసనకారుల శిబిరాన్ని సందర్శించనున్నారు. కార్మికులకు తన సంఘీభావాన్ని ప్రకటించనున్నారు. బీజేపీతో ఏపీలో జనసేన భాగస్వామ్యం కొనసాగిస్తున్న నేపథ్యంలో..కేంద్రం తీసుకున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయంపై పవన్ పోరాటం ఆసక్తి కలిగిస్తోంది.
బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్న పవన్..కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా స్టీల్‌ప్లాంట్ ఉద్యమానికి మద్దతు ఇవ్వడంపై ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సభలో ఏం మాట్లాడుతారు అన్నదానిపై రాజకీయ వర్గాలలో ఆసక్తి నెలకొంది.