జస్టిస్ కనక రాజుకు ఆంధ్రాలో మరో పోస్టు : సిఎం జగన్ ఆదేశాలు

0
108

ఆంధ్రప్రదేశ్ పోలీసు కంప్లైంట్స్ అథారిటీ ఛైర్మన్ గా జస్టిస్ కనగరాజును ప్రభుత్వం నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ కనగరాజు పేరు వినగానే ఆంధప్రదేశ్ రాజకీయాలపై అవగాహన ఉన్న ఎవరికైనా స్టేట్ ఎలక్షన్ కమిషన్ వ్యవహారం గుర్తుకు రాకమానదు. మొన్నటి వరకు స్టేట్ గవర్నమెంట్ వర్సెస్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్నట్లుగా ఆంధ్రాలో రాజకీయం నడిచింది. ఈ నేపథ్యంలోనే జస్టిస్ కనగరాజు వెలుగులోకి వచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సిఎం జగన్ వర్సెస్ మాజీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఛైర్మన్ నిమ్మగడ్డ రమేష్ ల వార్ మనం చూసే ఉన్నాం. వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఆంధ్రా రాజకీయాలను ఢిల్లీకి తీసుకెళ్లారు. పదే పదే కోర్టులు జోక్యం చేసుకున్న పరిస్థితి ఉంది.  వీరిద్దరి మధ్య వార్ లో ఎన్నికల కమిషన్ ఛైర్మన్ నిమ్మగడ్డ రమేష్ పలు సందర్భాల్లో పైచేయి సాధించారు. అయితే వీరిద్దరి మధ్య జస్టిస్ కనగరాజు నలిగిపోయారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఛైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ జస్టిస్ కనగరాజును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. జస్టిస్ కనగరాజు బాధ్యతల్లో చేరిపోయారు. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టుల్లో న్యాయపోరాటం చేసి గెలిచారు. మళ్లీ ఎన్నికల కమిషన్ ఛైర్మన్ గా అయిపోయారు. దీంతో జస్టిస్ కనగరాజు పదవి కోల్పోవాల్సి రావడమే కాకుండా ఒకింత ఇబ్బందిరకంగా ఫీలయ్యే పరిస్థితి వచ్చింది.

ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఛైర్ పర్సన్ గా నీలం సహానిని ప్రభుత్వం నియమించింది. ఇగ జస్టిస్ కనగరాజు విషయంలో ఆయనకు సముచిత గౌరవాన్ని కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఛైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ అథారిటీ పదివిలో కనగరాజు మూడేళ్లపాటు కొనసాగుతారు. అథారిటీలో మరో ముగ్గురు సభ్యులను సైతం ప్రభుత్వం నియమించనుంది. అలాగే జిల్లా స్థాయిలోనూ పోలీస్‌ కంప్లైంట్స్‌ అథారిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.