కవిత ఓటమి వారి అవకాశాలను దెబ్బతీసింది…

కవిత ఓటమి వారి అవకాశాలను దెబ్బతీసింది...

0
96

నిజామాబాద్ లో కవిత ఓటమి ఇద్దరి రాజకీయ అవకాశాలను దెబ్బతీసిందా ? అంటే అవుననే టీఆరెస్ వర్గాలు అంటున్నాయి . నిజామాబాద్ కు చెందిన ఆర్మూర్ మాజీ శాసనసభ్యుడు ఆర్కే సురేష్ రెడ్డి , మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావులు ఎన్నికలకు ముందు టీఆరెస్ లో చేరిన విషయం తెల్సిందే . టీఆరెస్ లో చేరిన వీరికి ఎమ్మెల్సీ పదవులు దక్కడం ఖాయమన్న ప్రచారం జరిగింది .

అయితే ఇటీవల ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు కనీసం వీరి పేర్లను కూడా పరిశీలించలేదని తెలుస్తోంది . యాదవరెడ్డి స్థానం లో ఎమ్మెల్సీ స్థానానికి నల్గొండ మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును ఖరారు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ , భవిష్యత్తులోనైన సురేష్ రెడ్డి , మండవ వెంకటేశ్వర్ రావులకు అవకాశం కల్పిస్తానని హామీ కూడా ఇవ్వకపోవడం వారి అనుచరులను నిరాశకు గురి చేసింది . నిజామాబాద్ లోక్ సభ స్థానికి కవిత పోటీ చేసిన సమయం లో సురేష్ రెడ్డి , మండవ ఆమె గెలుపు కోసం పెద్దగా పని చేయలేదన్న వాదనలు విన్పిస్తున్నాయి .

ఈ మేరకు ముఖ్యమంత్రి కి పార్టీ పరంగా నివేదికలు కూడా అందినట్లు తెలుస్తోంది . పార్టీ నేతల సమన్వయ లోపం వల్లే కవిత ఓటమి పాలయిందని భావిస్తోన్న కేసీఆర్ , ఎవరైతే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పని చేయలేదో వారిని పక్కన పెట్టారన్న టాక్ పార్టీ వర్గాల్లో విన్పిస్తోంది . అదే నిజమైతే సురేష్ రెడ్డి , మండవ లకు భవిష్యత్తు కీలక నామినేటెడ్ పదవులు దక్కనట్లేనన్న వాదనలు విన్పిస్తున్నాయి .