కారెక్కిన మోత్కుపల్లి..సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

Karekkina Motkupalli..CM KCR Key Comments

0
32

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్‌ సమక్షంలో సోమవారం తెలంగాణ భవన్ లో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మోత్కుపల్లికి కండువా కప్పిన కేసీఆర్‌ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మోత్కుపల్లి తనకు అత్యంత సన్నిహితుడని పేర్కొన్నారు. ఆయనకు ఎంతో రాజకీయ అనుభవం ఉందని కొనియాడారు. ఆనాడు విద్యుత్‌ కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డామని, తెలంగాణ సాధనలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నామన్నారు.

మిగతా పార్టీలకు రాజకీయాలంటే ఒక ఆట. కానీ టీఆర్ఎస్ కు అలా కాదన్నారు. దళితబంధు యజ్ఞం ఇంతటితో ఆగిపోదు. బీసీలు, ఓబీసీలకు వర్తింపజేస్తాం. గత 60 ఏళ్లలో మిగతా పార్టీలు ఈ పనులన్ని ఎందుకు చేయలేకపోయామని చురకంటించారు.

అలాగే తెలంగాణ ఏర్పాటు నాడు ఉన్న పరిస్థితులను వివరించారు. తెలంగాణ స‌మాజం అత్యంత దారుణ‌మైన ప‌రిస్థితుల‌ను అనుభ‌వించింది. చాలా బాధ‌లు ప‌డ్డాం. చాలా అనుభ‌వించాం. ఒక‌ప్పుడు న‌ర్సింహులు క‌రెంట్ మంత్రిగా ఉండే. నేను ఆయ‌న‌ను క‌లిసిన‌ప్పుడు క‌రెంట్ బాధ‌లు ఉన్నాయ‌ని చెప్పిండు. క‌రెంట్ కోసం తెలంగాణ ప్రాంతం ఎన్నో క‌ష్టాలు ప‌డ్డ‌ది. నేను మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఓ సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ‌కు పెట్టుబ‌డులు రావు అని అన్నాడు. అప్పుడు నేను గొడ‌వ‌ప‌డ్డాను.

తెలంగాణ వ‌స్తే ఏం అభివృద్ధి జ‌ర‌గ‌ద‌ని చిత్రీక‌రించారు. అనేక అవ‌మానాల‌ను తెలంగాణ స‌మాజం ఎదుర్కొన్న‌ది. తెలంగాణ ఉద్య‌మం మొద‌లుపెట్టిన త‌ర్వాత కూడా అనేక భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశారు. ఆలేరు, భువ‌న‌గిరి, జ‌న‌గామ వ‌ద్ద మంచినీళ్ల వ్యాపారం మొద‌లుపెట్టారు. చాలా భ‌యంక‌ర‌మైన ప‌రిస్థితి. మంచినీల్లు రావు, క‌రెంట్ స‌మ‌స్య‌.. ఆ ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నాం అని కేసీఆర్ గుర్తు చేశారు.