ఉప రాష్ట్రపతిగా కేసీఆర్- సీఎంగా కేటీఆర్..కేంద్రమంత్రిగా హరీష్ రావు?

0
97

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నారని, తర్వాత ఆయన కుమారుడు కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు ఢిల్లీ రాజకీయాల పైన కేసీఆర్ కన్ను వేసినట్లు తెలుస్తుంది. ఆయన గత నెలలో తెలంగాణ భవన్ భూమి పూజ కోసం వెళ్లిన సమయంలో దాదాపు వారం రోజుల పాటు అక్కడే మకాం వేసారు. ప్రధాని మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులను కలిసారు. అయితే ఢిల్లీ కేంద్రంగా కేసీఆర్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారనే ప్రచారం సాగింది.

ఇక ఇప్పుడు కొత్త అంశాలు తెర పైకి వస్తున్నాయి. గతంలో ఒకసారి జరిగిన ప్రచారం ఇప్పుడు తిరిగి తెర మీదకు వచ్చింది. కేసీఆర్ ఉప రాష్ట్రపతి కావాలని కోరుకుంటున్నారని..బీజేపీ పెద్దల నుంచి సానుకూలత ఉందనేది విశ్వసనీయవర్గాల సమాచారం. ప్రస్తుతం ఉప రాష్ట్రపతి గా ఉన్న వెంకయ్య నాయుడు పదవీ కాలం పూర్తయిన తరువాత ఆయన స్థానంలో మరో తెలుగు వ్యక్తిగా కేసీఆర్ కు అవకాశం దక్కనుందని తెలుస్తుంది.

ఇదే జరిగితే సీఎంగా కేటీఆర్ ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పని చేసిన అనుభవం కేటీఆర్ కు పనికొస్తుంది. కేటీఆర్ కు రాజకీయంగా భవిష్యత్ లోనూ ఎక్కడా ఇబ్బందులు రాకుండా…తన మేనల్లుడు ట్రబుల్ షూటర్ గ పేరొందిన హరీష్ ను కేంద్ర కేబినెట్లోకి పంపాలని కేసీఆర్ భావిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

ఇలా కేసీఆర్ కు ఉప రాష్ట్రపతి..హరీశ్ కు కేంద్ర మంత్రి పదవి ఇవన్నీ ఒకే కుటుంబానికి చెందిన వారికి ఇవ్వటం సాధ్యమేనా అనే చర్చ సాగుతోంది. ఇక, దీని పైన అటు బీజేపీ..ఇటు గులాబీ పార్టీ నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది ఆసక్తికరంగా మారుతోంది.