దేశంలో కేసిఆర్ ఏకైక మొనగాడు

0
114
KCR visits Kondagattu

దేశంలో ఒక దళిత కుటుంబానికి 10లక్షల రూపాయలు ఇస్తానన్న ఏకైక మొనగాడు కేసిఆర్ ఒక్కడే అని పొగడ్తల వర్షం కురిపించారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దళిత బంధును అడ్డుకోవడం సరికాదన్నారు. ఈ పథకం తెచ్చిన కేసిఆర్ ను అందరూ బలపర్చాలన్నారు. ఈ పథకం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారికి గ్రామాల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

సమసమాజ స్థాపన జరగాలని ఆకాంక్షించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దమ్ము దైర్యం ఉంటే రాజీనామా చేయాలని సవాల్ చేశారు. దళిత పథకాలకు గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుబంధులాగా దళిత బంధు మంచి పథకం అని కితాబిచ్చారు. అట్టడుగు వర్గాల వారికి ఈ పథకం అన్ని రకాలుగా ఉపయోగ పడుతుందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు దళిత బంధును స్వాగతించాలని కోరారు.

స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కేసీఆర్ కు ఒక్కరికే ఉందన్నారు. జాతీయ పార్టీలు ఇలాంటి పథకాలు తీసుకు వచ్చే అవకాశం లేనేలేదన్నారు. 40 ఎకరాల అసైన్డ్ భూములు లాక్కున్న ఈటల రాజేందర్ కు పుట్టగతులు ఉండవని శాపనార్థాలు పెట్టారు. ఈటలను హుజురాబాద్ ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈటెల రాజేందర్ బావమరిది దళితులను బూతులు తిట్టడం సరికాదని హెచ్చరించారు. ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న ఈటెలను నమ్మొద్దన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులకు ఈ పథకం విస్తరించాలని విన్నవించారు.