కేసీఆర్… క్రైసిస్ వస్తే తప్ప రంగంలోకి రారు. ఐతే ఫాంహౌస్ లేదంటే ప్రగతి భవన్ లో ఆయన ఒంటరిగా కూర్చొని విపక్షాలను చిత్తుచేసే ఎత్తులు వేస్తుంటారు. ఆలోచన పదునెక్కిందే తడవు ఎగ్జిక్యూటర్స్ ను రంగంలోకి దింపుతారు. అది కొన్ని సందర్భాల్లో హరీష్ కావచ్చు, కొన్ని సందర్భాల్లో కేటీఆర్ కావచ్చు. ట్రబుల్ షూటరైనా… త్రిబుల్ షూటరైనా పైకి కనిపించే వ్యక్తులే తప్ప… దాని వెనుక శక్తి కేసీఆరే. ఆలోచన, వ్యూహం, ఎత్తుగడ అంతా కేసీఆర్ దే. ఆయన ఆలోచనకు కార్యరూపం తేవడం మాత్రమే ఈ ట్రబుల్ షూటర్స్ పని.
కానీ, చాలా కాలం తర్వాత ఈ వ్యూహకర్త రంగ ప్రవేశం చేస్తున్నాడు. నేరుగా బరిలో దిగుతున్నాడు. రెస్ట్ మోడ్ నుంచి వార్ మోడ్ లోకి అడుగు పెడుతున్నాడు. ట్రబుల్ షూటర్స్… త్రిబుల్ షూటర్స్ ను కాదని ఆయనే నేరుగా సీన్ లోకి వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో కేసీఆర్ నేరుగా జన క్షేత్రంలోకి వస్తున్నాడు. పార్టీ శ్రేణులతో మమేకమవుతున్నాడు. పథకాలపై పథకాలు ప్రకటిస్తున్నాడు. హుజూరాబాద్ ఎలక్షన్స్ ను నేరుగా తనే డీల్ చేస్తున్నాడు. ఒక్క హుజూరాబాదే కాదు… రాష్ట్రంలో ప్రతి అంశంలోనూ నేరుగా కేసీఆరే కనిపిస్తున్నారు. కేసీఆర్ లో ఈ తాజా మార్పు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్… ఎందుకు గేరు మార్చారు. వ్యూహకర్త నుంచి ఎగ్జిక్యూటర్ గా ఎందుకు మారుతున్నారు… ఈ క్వశ్చన్ ఇప్పుడు హాట్ టాపిక్.
రాష్ట్రంలో ప్రతిపక్షాలు స్పీడయ్యాయి. గత ఏడాది కాలంగా బీజేపీ కొంత అగ్రెసివ్ గానే ఉంది. ఐతే, ఆ అగ్రెసివ్ నెస్ కేసీఆర్ ఆనలేదు. రెండు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడుగా నియమించింది. అప్పుడు కూడా కేసీఆర్ లైట్ గానే ఉన్నారు. దళితబంధు స్కీంతో హుజూరాబాద్ ను దున్నేసే స్కెచ్ లో తలమునకలై ఉన్నారు. కానీ, కేసీఆర్ దళిత బంధుకు కౌంటర్ గా కాంగ్రెస్ రచించిన వ్యూహం ఇప్పుడు ఈ వ్యూహకర్తను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దళిత – గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరుతో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ క్షేత్ర స్థాయిలో అగ్గిపుట్టిస్తోంది. మొదట ఇంద్రవెల్లి, తాజాగా రావిర్యాల… ఇప్పుడు కేసీఆర్ దత్తత గ్రామమైన మూడు చింతలపల్లిలో దీక్ష… ఇలా కాంగ్రెస్ గేరు మీద గేరు మారుస్తుండటంతో కేసీఆర్ అలెర్ట్ అయినట్టు కనిపిస్తోంది. రేవంత్ స్పీడ్ కు ఇక ఇంట్లో కూర్చుంటే లాభం లేదన్న అభిప్రాయానికి కేసీఆర్ వచ్చారేమో అనిపిస్తోంది. అందుకే… సార్ రంగంలోకి దిగారు. కౌంటర్ ఎటాక్స్ మొదలు పెట్టారు. ఇంద్రవెల్లి, రావిర్యాల సభల మరుసటి రోజు మంత్రి వర్గాన్ని రంగంలోకి దింపారు. పది మంది ముఖ్యనేతలతో రేవంత్ రెడ్డి పై ఎటాక్ చేయించారు. తాజాగా తను దత్తత తీసుకున్న గ్రామాన్నే ఎంచుకుని రేవంత్ రెడ్డి దీక్షకు దిగడంతో కేసీఆర్ ఇంకా స్పీడు పెంచినట్టు కనిపిస్తోంది. సరిగ్గా కాంగ్రెస్ దీక్ష సమయానికి, దీక్ష రోజే కేసీఆర్ టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని పిలిచారు. ఇప్పటికిప్పుడు కార్యవర్గాన్ని పిలిచి దిశానిర్ధేశం చేయాల్సిన అంశమేదీ లేదు. కానీ, సీఎం స్థాయిలో రంగ ప్రవేశం చేసి, ఏదో ఒక కార్యక్రమం తీసుకుంటే తప్ప మీడియాలో సీన్ బ్యాలెన్స్ తప్పుతుందనుకున్నారేమో… రేవంత్ దీక్షకు పోటీగా రాష్ట్ర కార్యవర్గ సమావేశంతో స్పేస్ ఆక్యూపై స్ట్రాటజీకి కేసీఆర్ దిగినట్టు కనిపిస్తోంది. ఇదొక్కటే కాదు…పైకి బీజేపీని టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తున్నా, టీఆర్ఎస్ లో అంతర్గతంగా కాంగ్రెస్ ను కట్టడి చేసే వ్యూహరచన చేస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. కేసీఆర్ నేరుగా సీన్ లోకి రావడంతో పార్టీ శ్రేణులు కూడా… “ఇక చూస్కోండి… మా సారు రంగంలోకి దిగారు… వార్ వన్ సైడే!” అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ రేసులో రేవంత్ రెడ్డి కేసీఆర్ ను దాటి పోగలడో లేక కేసీఆరే చరిత్ర పునరావృతం చేస్తూ సరిలేరు నాకెవ్వరూ అనిపించగరో… వెయిట్ అండ్ సీ.
రంగంలోకి కేసీఆర్… ఇక కాస్కోండి అంటోన్న టీఆర్ఎస్!
KCR strategic Plan Started in Telangana politics