తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు పథకం అమలుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి దతత్తగ్రామం వాసాలమర్రి, హజూరాబాద్ నియోజకవర్గాల్లో పైలట్ పద్ధతిన పూర్తి స్థాయిలో పథకం అమలవుతోంది. మరో నాలుగు మండలాల్లోనూ ఖమ్మం జిల్లా చింతకాని, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, నాగర్కర్నూల్ జిల్లా చారగొండ, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలాల్లో ఈ పథకం అమలవుతుంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో దళితబంధు పథకం అమలు చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. ప్రతి నియోజకవర్గంలో ఒక కుటుంబాన్ని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని ఆదేశించారు. మార్చి నెలలోపు 100 కుటుంబాలకు దళితబంధు పంపిణీ చేయాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఇందుకోసం స్థానిక శాసనసభ్యుల సలహాతో లబ్దిదారులను ఎంపిక చేసి జాబితాను సంబంధిత జిల్లా ఇంఛార్జి మంత్రులతో ఆమోదించుకోవాలని తెలిపారు.
ప్రతి లబ్ధిదారుడికి బ్యాంకు లింకేజి లేకుండా పది లక్షల రూపాయల ఆర్థికసాయంతో కోరుకున్న యూనిట్నే ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. ఒక్కో లబ్దిదారుడికి మంజూరైన పది లక్షల నుంచి పదివేల రూపాయలతో ప్రత్యేకంగా దళితబంధు రక్షణ నిధి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 118 నియోజకవర్గాల్లో పథకం అమలు కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1200 కోట్ల రూపాయలు కేటాయించి అందులో ఇప్పటికే వంద కోట్లు విడుదల చేశారు. మిగతా మొత్తాన్ని విడతల వారీగా విడుదల చేయనున్నారు.