తీవ్ర అనారోగ్యం బారిన పడిన కిమ్..కీలక విషయాలు వెల్లడించిన సోదరి

0
110

ఉత్తరకొరియాలో ఇటీవల కరోనా వైరస్‌ విజృంభించిన విషయం తెలిసిందే. ఆ దేశాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కూడా తీవ్ర అనారోగ్యం పాలయ్యారట. ఈ విషయాన్ని ఆయన సోదరి కిమ్‌ యో జోంగ్ తాజాగా వెల్లడించారు. అయితే ఆయనకు కరోనా సోకిందా లేదా అన్న విషయంపై మాత్రం ఆమె స్పష్టతనివ్వలేదు.

కిమ్‌ అనారోగ్యం గురించి ఆయన సోదరి ఓ ప్రసంగంలో చెప్పినట్లు ఉత్తరకొరియా అధికారిక మీడియా వెల్లడించింది. జ్వరం కారణంగా తన సోదరుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని కిమ్ యో జోంగ్‌ తెలిపారు. కానీ, ప్రజల పట్ల ఆయనకున్న ఆందోళనల కారణంగా ఒక్క క్షణం కూడా ఆయన విశ్రాంతి తీసుకోలేదన్నారు.

ఉత్తరకొరియా అధినేత కిమ్ అనారోగ్యానికి గురయ్యారంటూ ఆ దేశం స్వయంగా అంగీకరించడం ఇదే తొలిసారి. గత కొంతకాలంగా కిమ్‌ అనారోగ్యంపై అనేక వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. అధిక బరువుతో బాధపడుతోన్న ఆయన ఇటీవల గుండె సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చేరినట్లు కథనాలు వెలువడ్డాయి. అలాగే కిమ్‌ దాదాపు 17 రోజుల పాటు మీడియాకు కన్పించలేదు. బుధవారమే అధికార పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్వారెంటైన్‌ యుద్ధాన్ని జయించానని ఆయన చెప్పడంతో కిమ్‌కు కొవిడ్‌ సోకింది నిజమేనని తెలుస్తోంది.