మానససరోవరం యాత్రంలో చిక్కుకున్న తెలుగు యాత్రికులను రక్షించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని నేపాల్‌లో ఉన్న భారత ఎంబసీ అధికారులను హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో ఎంబసీ అధికారులు రంగంలోకి దిగారు. ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా అక్కడ చిక్కుకున్న యాత్రికులను నేపాల్ రాజధాని ఖాట్మండూకు తరలిస్తున్నారు. మరోవైపు అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తన కార్యాలయానికి తెలియజేయాల్సిందిగా అధికారులను కిషన్‌రెడ్డి కోరారు.
మానససరోవరం యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులకు.. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో గత ఐదురోజులుగా నరకయాతన అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 13న హైదరాబాద్‌కి చెందిన 40 మంది మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. సదరన్ ట్రావెల్స్ ద్వారా యాత్రకు వెళ్లిన వీళ్లు.. చైనా నేపాల్ సరిహద్దు ప్రాంతమైన మానససరోవర్‌లో అనూహ్యంగా చిక్కుకుపోయారు. దీంతో గత నాలుగురోజులుగా బాహ్యప్రపంచాన్ని చూడలేని పరిస్థితుల్లో వీరు ఉన్నారు. హైదరాబాద్ వాసులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ట్రావెల్ ఏజెన్సీ మాత్రం అస్సలు పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. ఎన్ని విజ్ఞప్తులు చేసినా సదరన్ ట్రావెల్స్ నుంచి స్పందన లేదని యాత్రికులు ఆరోపించారు. తమ గోడను వివరిస్తూ వీడియో రికార్డ్ చేసి కుటుంబసభ్యులకు వీడియో ద్వారా వారి బాధలను తెలియజేసిన విషయం తెలిసిందే.