తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. మంత్రి కేటిఆర్ ఫామ్ హౌస్ పేరుతో తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి అగ్గి రాజేశారు. కేటిఆర్ ఫామ్ హౌస్ ఇదే అంటూ కొన్ని డ్రోన్ వీడియోలను, ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. కేటిఆర్ ఫామ్ హౌస్ గా ఆరోపిస్తున్న భూభాగం వద్దకు మీడియాను తీసుకుపోయి హల్ చల్ చేశారు.దీంతో అగ్గి మీద గుగ్గిలమైన తెలంగాణ సర్కారు రేవంత్ పై కేసులు బనాయించింది. ప్రయివేటు ప్రాపర్టీ అంటే కేటిఆర్ ఫామ్ హౌస్ గా చెప్పబడుతున్న భూభాగంలో డ్రోన్ కెమెరా ఎగురవేసినందుకు రేవంత్ రెడ్డి మీద కేసులు బనాయించి అరెస్టు చేశారు పోలీసులు. అయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పలు కీలక ప్రశ్నలు సమాజం ముందు లేవనెత్తారు. 111 జిఓ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. అలాంటి జిఓ అమలులో ఉన్న చోట విలాసవంతమైన మూడు అంతస్థుల భవనాన్ని కేటిఆర్ ఎలా నిర్మించుకున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అంతేకాదు ఈ విషయాన్ని తానరు వెలుగులోకి తెచ్చినందున అక్రమాలకు పాల్పడిన కేటిఆర్ ను అరెస్టు చేసి జైలుకు తరలించాల్సిందిపోయి తనను జైలుపాలు చేశారెందుకని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమార్కులకు తెలంగాణ పోలీసులు కొమ్ము కాస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.
రేవంత్ రెడ్డికి బెయిల్ రాకుండా పోలీసులు, కేసిఆర్ సర్కారు కుట్రలు చేస్తోందని మరోవైపు రేవంత్ వర్గం ఆరోపిస్తున్నది. న్యాయపరమైన అంశాల్లో కొంత ఆలస్యం కారణంగా రేవంత్ రెడ్డి కొన్ని గంటలు అధికంగా జైలులో మగ్గిపోయారు. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి సొంత పార్టీలో మిశ్రమ స్పందన వస్తున్నది. కొందరు రేవంత్ రెడ్డికి బాసటగా నిలిస్తే… మరికొందరు కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఈ ఫామ్ హౌస్ ముచ్చటే గొప్ప సమస్యగా కనబడుతున్నదా అని కొందరు కాకలు తీరిన కాంగ్రెస్ యోధులు ప్రశ్నిస్తున్నారు. బోలెడన్ని సమస్యలు ఉంచుకుని కేటిఆర్ ఫామ్ హౌస్ వివాదం చేయడం, 111 జిఓ ను వివాదం చేయడమెందుకని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు పెద్ద కాంగ్రెస్ నేతలైతే… అసలు 111 జిఓను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ టిఆర్ఎస్ కు మద్దతుగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డికి తనతో వచ్చిన టిడిపి బ్యాచ్ మాత్రమే మద్దతుగా నిలబడుతున్నారు. సీతక్క, వేం నరేందర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, కోటూరి మానవత్ రాయ్ లాంటి కొత్త తరం నేతలే బాసటగా ఉన్నారు. ఇక సీనియర్లు గుర్రుగా ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం రేవంత్ రెడ్డికి బాసగా నిలిచారు. కాంగ్రెస్ లోనే ఒక వర్గం వ్యతిరేకిస్తున్నప్పటికీ పక్క పార్టీ నేత కోదండరాం మద్దతు ఇవ్వడం రేవంత్ శిబిరంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కోదండరాం పార్టీకి ఓట్లు, సీట్లు రాకపోయినా… ఆయన మాటకు జనాల్లో విలువ ఉంది. పూటకో తీట రాజకీయం చేయడు అన్న పేరుంది. తాజాగా రేవంత్ రెడ్డి అరెస్టు అక్రమం అంటూ కోదండరాం ఖండించారు. రేవంత్ రెడ్డి మీద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి మీద కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేశారు. సొంత పార్టీ నేతలే ఓన్ చేసుకోకపోయినా కోదండరాం తాజాగా రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలబడడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.