చంద్రబాబుపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు

Lakshmi Parvati's sensational remarks on Chandrababu

0
116

నిన్న ఏపీ అసెంబ్లీలో జరిగిన చంద్రబాబు ఎపిసోడ్‌పై వైసీపీ నేత లక్ష్మీపార్వతి స్పందించారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని చంద్రబాబు మళ్లీ మోసం చేస్తున్నారని ఆమె అన్నారు. సీనియర్ ఎన్టీఆర్ ఇష్యూలో చేసినట్లుగానే..అసెంబ్లీ అంశంలోనూ చంద్రబాబు అబద్దాలు చెప్పారన్నారు.

అక్కడ ఏమి జరగకపోయినా..మసిపూసి మారేడుకాయ చేశారని చంద్రబాబుపై లక్ష్మీపార్వతి విమర్శనాస్త్రాలు గుప్పించారు. తాను వైసీపీ నాయకురాలిగా మీడియా ముందుకు రాలేదని ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలిగా మాత్రమే వచ్చానని చెప్పుకొచ్చారు. కన్నీళ్లు పెట్టుకొని పెద్ద సీన్‌ క్రియేట్‌ చేశారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు.

ఆ మహానీయుడి కుటుంబంలో పుట్టి ఇంత మూర్ఖంగా ఎలా ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. మీ నాన్నగారి విషయంలో చంద్రబాబు ఒక్క నిజం కూడా చెప్పలేదని, ఎన్టీఆర్‌ ఎపిసోడ్‌లోనూ భువనేశ్వరి, పురందేశ్వరి బాలకృష్ణ మనసు మార్చారని పేర్కొన్నారు.చంద్రబాబు గురించి ఎన్టీఆరే స్వయంగా చెప్పారు కదా..ఇప్పుడు మళ్లీ చంద్రబాబు మిమ్మల్ని మోసం చేస్తున్నాడని విమర్శించారు.

ఇప్పటివరకు చెప్పని ఓ నిజాన్ని చెబుతున్నా ‘ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత చంద్రబాబు నాకు ఫోన్ చేసి.. ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తానని ఫారిన్ వెళ్లిపో’ అని అన్నారు. ఇది నిజమో కాదో బాలయ్య చంద్రబాబును అడగాలి. ఎన్టీఆర్ ఫ్యామిలీ చంద్రబాబు మాయలో మరోసారి పడొద్దని కోరుతున్నా.. మిమ్మల్ని అబద్దాల వలయంలో చుట్టేశారు. లోకేష్‌ను సీఎం చేయాలన్నదే చంద్రబాబు టార్గెట్‌‌ని లక్ష్మీ పార్వతి చెప్పారు.