గతేడాది అక్టోబర్ 25న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఆ రోజు జగన్ హైదరాబాదు రావడం కోసం విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఉండగా, సెల్ఫీ తీసుకునే వంకతో శ్రీనివాస్ అనే యువకుడు ఆయనపై కోడికత్తితో దాడిచేశాడు. ప్రస్తుతం శ్రీనివాస్ రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో అతని న్యాయవాది సలీం సంచలన ఆరోపణలు చేశారు. జైలులో శ్రీనివాస్ పై హత్యాయత్నం జరిగిందని లాయర్ సలీం ఆరోపించారు.
జైలర్ , జైలు వార్డెన్ తనపై దాడి చేసినట్లు శ్రీనివాస్ తనకు చెప్పాడన్నారు. శ్రీనివాస్ కు రాజమండ్రి జైలులో ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి జైలు జైలర్, వార్డెన్ లపై కేసు నమోదుచేయాలని ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశానని సలీం వెల్లడించారు. శ్రీనివాస్ ను మరో జైలుకు తరలించాల్సిందిగా పిటిషన్ లో కోరినట్లు ఆయన తెలిపారు.