ఈత చెట్టు ఎక్కిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ : షాకింగ్ ట్వీట్

0
83

మాజీ ఐపిఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈత చెట్టు ఎక్కారు. గీత కార్మికుల కష్టం ఎట్లుంటదో ప్రత్యక్షంగా చూశారు. ఈత చెట్లు, తాటిచెట్లు ఎక్కి వారి కాళ్లకు కాసిన కాయలను (గాయాలను) చేతితో టచ్ చేసి చూసి చలించిపోయారు. తర్వాత తన అనుభవాన్ని ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘‘Life of toddy tappers is really miserable. Their bodies turned numb to pain. కల్లు గీత కార్మిక సోదరుల జీవనశైలి హృదయవిదారకం. చెట్లెక్కి వాళ్ల శరీరాలు గాయాలతో మొద్దుబారి పోయినై. నేను రెండు నిముషాలు కూడా ఈత చెట్టు పై నిలబడలేక పోయాను. ఈ పనిని వీళ్లు తరతరాలుగ చేస్తున్రు. Respect‘‘ అంటూ ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఆయన ట్వీట్ లింక్ కింద ఉంది చూడొచ్చు.

 

నేను చేసింది త్యాగం కాదు :

తాను ఉన్నతమైన ఐపిఎస్ పదవికి రాజీనామా చేయడం త్యాగమేమీ కాదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా జన్నారంలో శుక్రవారం జరిగిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. బహుజనులు రాజ్యాధికారంలోకి వచ్చినప్పుడే పెత్తందారీతనం పోతుందన్నారు. బహుజనులను కాపాడుకుంటూ రాజ్యాధికారం వైపు నడిపిస్తానని చెప్పారు.

రానున్న రోజుల్లో గ్రామాల నుంచే ఎంపీలు, ఎమ్మెల్యేలను తయారు చేస్తానని చెప్పారు. ప్రజలు డబ్బు, మద్యం లాంటి ప్రలోభాలకు లొంగి ఓట్లు వేయకూడదన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పెట్టే ఖర్చుతో ప్రభుత్వం పది లక్షల మంది విద్యార్థులకు ల్యాప్ టాప్ లు కొనివ్వొచ్చన్నారు. అదే డబ్బుతో పేద ప్రజల కోసం కార్పొరేట్ ఆసుపత్రిని నిర్మించి ఇవ్వొచ్చని చెప్పారు.

బహుజనులను కాపాడుకుంటూ వారిని రాజ్యాధికారం వైపు నడిపిస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు చిన్నారులు తాము దాచుకున్న డబ్బులను ఉద్యమం కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు అందజేశారు. వారిని ఆయన అభినందించారు. ఈ పర్యటనలో ఆర్ఎస్ ప్రవీణ్ తో పాటు బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్, రాష్ట్ర కోఆర్డినేటర్ దేవోళ్ల గంగాధర్ తదితరులు ఉన్నారు.

గీతకార్మికుల కాళ్లను చేతితో తాకి…

ఆదిలాబాద్ జిల్లా జన్నారంలో జరిగిన అభినందన సభకు వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో దండేపల్లి మండలంలోని నాగసముద్రం అనే గ్రామంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొద్దిసేపు ఆగి గీతకార్మికులతో ముచ్చటించారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. మోకు వేసుకుని ఈత చెట్టు ఎక్కారు. కానీ రెండు నిమిషాలు కూడా చెట్టు మీద ఉండలేకపోయారు. గీత కార్మికుల కాళ్లకు అయిన కాయల (బొగ్గలు, గాయాల)ను చూసి చలించిపోయారు. వారి కష్టాన్ని గుర్తించిన ఆయన తర్వాత హైదరాబాద్ వచ్చి వారి గురించి ట్విట్టర్ లో ఒక పోస్టు చేశారు.