చేతిలో కెమెరా పట్టుకుని `స్మైల్ ప్లీజ్` అంటారు. ఎదుటివారి ముఖంలో చిరునవ్వులు పూయిస్తారు. సరిగా నవ్వకపోతే.. `ఇంకాస్త నవ్వాలి..` అని మరీ సలహా ఇస్తారు. పెళ్లిళ్లు.. పేరంటాలు.. ఫంక్షన్లు.. ఏవి జరిగినా వారు ఉండి తీరాల్సిందే. వీలైతే ఫొటో.. ఇంకా కావాలంటే వీడియో..! శుభ గడియలను ఛాయా చిత్రాలుగా మార్చి జ్ఞాపకాల ఆల్బమ్‌ను కానుకగా ఇస్తారు. దృశ్యాలకు సంగీత సొబగులు పొదిగి సుందర సుమధుర కావ్యాన్ని బహుమానంగా ఇస్తారు. వీరే.. ఫొటోగ్రాఫర్లు. వీడియో గ్రాఫర్లు.
ఎదుటివారి ముఖాల్లో చిరునవ్వులు పూయించే వీరి జీవితాల్లో ఇప్పుడు విషాదపు చీకట్లు అలుముకున్నాయి. కరోనా మహమ్మారి దేశంలో చొరబడినప్పటి నుంచి వీరిని పిలిచేవారే కరువయ్యారు. శుభకార్యాలు మూడు నెలల పాటు జరగనేలేదు. ఇప్పుడు మొదలవుతున్నా.. కుటుంబ సభ్యులకు మాత్రమే వేడుకలు పరిమితమవుతున్నాయి. ఆకాశమంత పందిరి.. భూదేవి అంత అరుగు వేసి.. అట్టహాసంగా పెళ్లిళ్లు పేరంటాలు జరిగితేనే వీరి కెమెరాలకు పని ఉంటుంది. ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ఫొటోలు, వీడియోలు తీయించుకునేవారు. కానీ ఇప్పుడు అందరికీ కొవిడ్ భయం పట్టుకుంది. దీంతో వీడియో గ్రాపర్లు, ఫొటోగ్రాఫర్ల జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయి.
అనంతపురం జిల్లా గుత్తి చాలా చిన్న పట్టణం. నిరుద్యోగ యువత ఎక్కువగా ఉండే ప్రాంతం. స్వయం ఉపాధి దిశగా సుమారు 60 మంది ఫొటో స్టూడియోలు పెట్టుకున్నారు. 100 మంది దాకా ఫొటో, వీడియో గ్రాఫర్లు ఉన్నారు. సీజన్‌లో అవుట్ డోర్, ఇండోర్ బిజినెస్ బాగా ఉండేది. రూ.లక్షలు సంపాదించకపోయినా.. కుటుంబాలు సాఫీగా సాగిపోయేంత ఆదాయం వచ్చేది. కానీ గడచిన నాలుగు నెలలుగా పైసా ఆదాయం లేదు. బ్యాంకు రుణాలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పు చేసి, రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన కెమెరాలు మూలకు చేరాయి. తమ యజమాని ఎప్పుడు దుమ్ము దులుపుతాడా, సున్నితమైన బట్టతో లెన్స్‌ను ఎప్పుడు శుభ్రం చేస్తాడా అని ఎదురు చూస్తున్నాయి. వాటి వైపు చూస్తే కెమెరామన్‌కు అప్పులు గుర్తొస్తున్నాయ.
ఒక్క చిన్న పట్టణంలోనే ఈ పరిస్థితి ఉంటే.. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయో ఆలోచించాల్సిందే. కెమెరాలు, వాటి ఉపకరణాలు, డ్రోన్లు, లైటింగ్ సిస్టం.. ఇలా రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసుకున్నారు. ఆధునికత పెరిగే కొద్దీ పెట్టుబడి భారం కూడా ఎక్కువ అయింది. వీరి గురించి ప్రభుత్వం ఆలోచించకపోతే ఈ వృత్తిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ లక్షల మంది జీవితాలు రోడ్డున పడతాయి.
అన్ని వృత్తుల వారికీ ప్రభుత్వం సాయం అందిస్తోంది. కానీ ఫొటో, వీడియోగ్రఫీని వృత్తిగా ఎంచుకున్న వారికి ఎలాంటి సాయమూ అందడం లేదు. ఈ కష్ట సమయంలో తమకూ అంతో ఇంతో ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. తమకు పని దొరికే వరకూ నెలకు ఇంత భృతి ప్రకటించాలని విన్నవిస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో మరికొందరు కెమెరాలను సగం ధరకు అమ్మేసుకుంటున్నారు.
చాలా మంది అద్దెలు చెల్లించలేక స్టూడియోలను ఖాళీ చేసేశారు.
`సీఎం జగనన్నా..! ఎందరికో సాయం చేశావు. మేమూ ఎదురు చూస్తున్నాం. మా వైపూ చూడండి..` అని బాధిత కుటుంబాలు విన్నవిస్తున్నాయి. స్టూడియోలు, ఇంటి అద్దె కట్టలేని పరిస్థితులు ఉన్నాయని, నిత్యావసరాలు కూడా కొనలేని దుస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.