కోకాపేట భూమల అమ్మకం తెలంగాణలో అగ్గి రాజేసింది. ఇవాళ కాంగ్రెస్ శ్రేణులు కోకాపేట లో అమ్మకం చేపట్టిన భూముల విజిట్ ప్రకటించడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఏకంగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డినే పోలీసులు హౌస్ అరెస్టు చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ్టినుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మల్కాజ్ గిరి ఎంపీ కూడా అయిన రేవంత్ రెడ్డి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. తాను పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనకుండా హౌస్ అరెస్టు చేశారని ఆరోపించారు. లేఖలోని అంశాలు ఇవీ.
నేను తెలంగాణ లోని మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి లోకసభ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ (టీపీసీసీ) అధ్యక్షుడిగా పని చేస్తున్నాను.
రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో మా గొంతు వినిపించాలని, తెలంగాణ లోని ప్రభుత్వ భూమిని వారి బంధువులకు మరియు టిఆర్ఎస్ అధికార పార్టీ కార్యకర్తలకు అతి తక్కువ ధరలకు విక్రయించడాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంటులో సమస్యను లేవనెత్తాలని మేము నిర్ణయించుకున్నాము.
నేను ఈ రోజు నుండి జరగనున్న పార్లమెంటు సమావేశానికి హాజరుకావాలని మరియు సంబంధిత అధికారులకు పదేపదే అభ్యర్థన చేసినప్పటికీ, ఢిల్లీకి వెళ్లాలని తెలిపినప్పటికీ తెలంగాణ రాష్ట్ర పోలీసులు పార్లమెంట్ కు నేను వెళ్లాడాన్ని అడ్డుకున్నారు.
పార్లమెంటు సభ్యుడు పార్లమెంటుకు హాజరుకావడం మరియు ప్రజల ఆందోళనలను తెలియజేయడం నా హక్కు, నా బాధ్యత.
పార్లమెంట్ నడుస్తున్న సమయంలో పార్లమెంట్ హక్కులను అడ్డుకొని పార్లమెంటుకు హాజరుకాకుండా చేశారు, రాజకీయ కారణాలతో పార్లమెంటు సభ్యుడిని అరెస్టు చేయడానికి గౌరవ స్పీకర్ అనుమతి ఖచ్చితంగా అవసరం.
అందువల్ల మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. పార్లమెంట్ కు ఉన్న ప్రత్యేక హక్కులను ఉపయోగించి నన్ను పార్లమెంట్ లో పాల్గొని ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాను.