సీఎం జగన్‌పై మందకృష్ణ ఫైర్

సీఎం జగన్‌పై మందకృష్ణ ఫైర్

0
75
Manda Krishna

ముఖ్యమంత్రి జగన్‌పై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమన్నజగన్‌ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో జగన్ ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. గతంలో మీ నాన్న(వైఎస్) వర్గీకరణకు ఎందుకు మద్దతు ఇచ్చారని అడిగారు. అలాగే 2010లో మీరు కూడా ప్రధానికి ఎందుకు లేఖ రాశారు? అని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణపై మీరు మాట తప్పడం.. మడమ తిప్పడం కాదా? అని అడిగారు.

బాపట్ల ఎంపీ నందిగం సురేష్ స్క్రిప్ట్ రాసిస్తే చదువుతున్నారని విమర్శించారు. జగన్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోక పోతే ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతుందని హెచ్చరించారు. జగన్ మా మీద నిర్బంధం ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. పాదయాత్రగా వచ్చి వినతి పత్రం ఇస్తామంటే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్లు చెప్పే జగన్.. మేం 36 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తామంటే ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని నిలదీశారు.

ప్రజాస్వామ్యంపై జగన్‌ చిలకపలుకులు పలుకుతున్నారని ఎద్దేవాచేశారు. ప్రభుత్వం ఎన్నికుట్రలు చేసినా అసెంబ్లీ ముందు మా ఆగ్రహాన్ని చాటుతామన్నారు. వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వర్గీకరణ మీద ఆశలు రేకెత్తాయని చెప్పారు. ప్రస్తుతం కిషన్‌రెడ్డి కూడా కొంత అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. జాతీ కోసమే బీజేపీతో స్నేహం తప్ప ఆ పార్టీలోకి వెళ్లడం అనేది అబద్ధమని కొట్టిపారేశారు.