మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(Mangalagiri MLA RK) మళ్లీ వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నేడో, రేపో ఆయన సీఎం జగన్‌తో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఆర్కే.. ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీలో తనకు ప్రాధాన్యత లభించడం లేదని ఆయన కినుక వహించినట్లు సమాచారం. దీంతో వెంటనే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆర్కేతో భేటీ అయి వైసీపీలోకి ఆహ్వానించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఆర్కే. సీఎం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.
మంగళగిరిలో టీడీపీ యువనేత నారా లోకేష్(Nara Lokesh)ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ పెద్దలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆర్కేను పార్టీలోకి ఆహ్వానించారని తెలుస్తోంది. కాగా ఆళ్ల రామకృష్ణారెడ్డి(Mangalagiri MLA RK) 2014, 2019 ఎన్నికల్లో మంగళగిరి ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి గెలిచారు. 2019 ఎన్నికల్లో ఏకంగా లోకేష్‌పై విజయం సాధించి టీడీపీకి షాక్ ఇచ్చారు. అయితే మంత్రి పదవి ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఆయన వైసీపీకి రాజీనామా చేశారు.