తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తునారు. బెజ్జెంకిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, చంద్రబాబు పేర్లు ప్రస్తావిస్తూ పలు కామెంట్స్ చేశారు.
చంద్రబాబునాయుడు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని గెలవాలని ప్రయత్నిస్తే ఆంధ్రాబాబు అని ప్రజలు వెల్లగొట్టారని ఎద్దేవా చేశారు. టీడీపీ ముఖం పెట్టుకుని వస్తే తెలంగాణ ప్రజలు రానివ్వరని, తన మనుషులను కాంగ్రెస్ లోకి పంపి తెలంగాణలో చంద్రబాబు అడుగు పెడుతున్నారని ఆరోపించారు.
స్వయంగా చంద్రబాబే మళ్లీ కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలోకి వస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు తన వాళ్లకు పదవులు ఇప్పిస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఎవరు ఓటుకు నోటు కేసులో ఉన్నవాడే కదా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు కు అత్యంత సన్నిహితుడు… ఇప్పుడు పీసీసీ చీఫ్ గా వచ్చాడని వివరించారు.
సభలో ఇంకా హరీష్ రావు మాట్లాడిన మాటలు…
టీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో బెజ్జంకి కమాన్ నుంచి బెజ్జంకి వరకూ భారీ బైక్ ర్యాలీతో పాటు పుష్పగుచ్ఛం, శాలువాతో మంత్రికి గ్రామ, మండల ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. డప్పు చప్పుల నడుమ బోనాలతో మహిళలు మంత్రికి గ్రామస్తులు స్వాగతం పలికారు.
నాలుగవ విడత పల్లె ప్రగతిలో భాగంగా గ్రామ మహిళా సమాఖ్య భవనాన్ని, అలాగే కల్లేపల్లి గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్-అంబేద్కర్ భవనాన్ని, లయన్స్ క్లబ్ ఆఫ్ బెజ్జంకి తరపున రూ.80 వేల రూపాయల విలువ కలిగిన బాడీ ఫ్రీజర్- శవ పేటికను కల్లెపల్లి గ్రామ పంచాయితీకి అందజేసిన సందర్భంగా క్లబ్ సభ్యులైన మోహన్, రవీంద్ర ప్రసాద్ లను మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మంత్రి శ్రీ హరీశ్ రావులు అభినందించారు. అనంతరం కల్లెపల్లి గ్రామ రైతువేదికను ప్రారంభించారు.
మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక గత వేసవిలో ఒక్క గుంట ఎండలేదు. ఎంతో కష్టపడి కాళేశ్వరం నీళ్లు తెచ్చి మిడ్ మానేరు నింపి నీళ్లు తెచ్చుకున్నాం. టీఆర్ఎస్ జెండా ఎత్తుకున్నాక.. పొలాల్లో నీళ్లు, ఇంటింటికీ తాగునీళ్లు వస్తున్నాయి. 70 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ చేయని పని టీఆర్ఎస్ చేసింది. ఏ చెరువు చూసిన నీటితో నిండి ఉన్నాయి. వానలు ఇంకా రాకముందే కాళేశ్వరం నీటితో నిండిపోయాయి. కాంగ్రెస్ హయాంలో క్రాప్ లోన్లు రావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి ఉండేది. సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కాలు బయట పెట్టకుండా రైతుబంధు డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఎకరానికి 5 వేలు రూపాయలు.. విత్తనాలు, నాట్లు, నారుమడి వంటి ఖర్చు కోసం ఇస్తున్నారు.
ఇక బీజేపీ ఏమైనా ఇస్తోందా.. ఏమీ ఇవ్వకపోగా ధరలు మాత్రం పెంచి పేదల నడ్డి విరుస్తోంది. డీజిల్ ధర రూ.100 చేసింది. రైతు శ్రేయస్సు కై ఎకరానికి టీఆర్ఎస్ 5 వేలు ఇస్తే., డీజిల్ ధర పెంచి బీజేపీ రైతుల పైసలు గుంజేసింది. ఏడేళ్లలో బీజేపీ దేశానికి ఏం చేసింది, పేద ప్రజల కోసం ఏం చేసింది. యేడాదిలో 25/26 రూపాయల పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. దీంతో అన్నీ ధరలు పెరిగాయి.
కరోనా కష్టకాలంలోనూ మేం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాం. ఒక్క గింజ లేకుండా ధాన్యం కొన్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణానే. 90 లక్షల మెట్రిక్ టన్నులు యాసంగిలో కొన్నాం. ఆంధ్రప్రదేశ్ లో 24 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఆనాడు ఆంధ్రా వాళ్లు వ్యవసాయం రాదని వెక్కిరించారు.. ఈనాడు వాళ్లు అసూయ పడేలా తెలంగాణ రాష్ట్రం ఎదిగింది.
దేశంలోనే అత్యధికంగా ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని, దేశంలోని రాష్ట్రాల్లో 2 కోట్ల 2 లక్షల మెట్రిక్ టన్నులు పంజాబ్ పండించగా తెలంగాణ, 3 కోట్ల మెట్రిక్ టన్నులు ధాన్యం పండించి దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ మారింది.